Nov 13,2023 08:17

బెంగళూరు: ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన భారత జట్టు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. భారత బ్యాటర్లు నెదర్లాండ్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. శతకాలు, అర్ధశతకాలతో కదం తొక్కారు. శ్రేయస్‌ అయ్యర్‌ 127 (93 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), కె.ఎల్‌.రాహుల్‌ 102 (64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో వీర విహారం చేసిన వేళ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (61బీ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (51బీ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. 11.5 ఓవర్లలో వీరి భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. ఈ క్రమంలో వాన్‌ మాకీరన్‌ బౌలింగ్‌లో తేజకు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్‌ శర్మ కూడా బాస్‌ డీ లీడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లీ (51బీ 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) శ్రేయస్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపాడు. అర్ధశతకంతో జోరుమీదున్న కోహ్లీని మెర్వీ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్‌ రాహుల్‌తో కలిసి శ్రేయస్‌ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 208 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో బాస్‌ దీ లీడీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేఎల్‌ రాహుల్‌.. సైబ్రాండ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 2 (1) నాటౌట్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డీ లీడీ రెండు వికెట్లు తీయగా, వాన్‌ డెర్‌ మెర్వీ, పాల్‌ వాన్‌ మీకిరన్‌ చెరో వికెట్‌ తీశారు. 10 ఓవర్లు వేసిన లోగాన్‌ వాన్‌ బీక్‌ ఏకంగా 107 పరుగులు సమర్పించుకున్నాడు.