- కాకరాపల్లి ధర్మల్ వ్యతిరేక దీక్షల 13 వ మహాసభలో వక్తలు
ప్రజాశక్తి -నౌపడ (శ్రీకాకుళం) : భారతదేశంలోగల అటవీ ప్రాంతం, కొండలు, పర్వత ప్రాంతం, తీరప్రాంతంలో గల లక్షలాది ఎకరాలు భూబాగాన్ని పాలకులు బడా పెట్టుబడి దారులతో చేతులు కలిపి కైవసం చేసుకుంటున్నారని అఖిల భారత రైతుకులీ సంఘం ఏపీ 'రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ ఆరోపించారు. కాకరాపల్లి ధర్మల్ వ్యతిరేక దీక్షలు వడ్డితాండ్రలో దీక్షాశిబిరం వద్ద ఏర్పాటు చేసిన 13వ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. పాలకుల దోపిడీకి మణిపూర్లో అటవీ కొండభూముల్లో ఉన్న గిరిజన ఆవాసాలను పొట్టన పెట్టుకొని అక్కడ భూములును ఆక్రమించిన సంఘటనే ఉదాహరణ అన్నారు. సంతబొమ్మాలి మండలం ప్రాంతంలో 2010 సంవత్సరంలో కాకరాపల్లి తంపర భూముల్లో చేపలు వేట చేసుకొని జీవిస్తున్న స్వదేశీ మత్యకారుల చేతుల్లో ఉన్న 3400 ఎకరాల భూమిని ప్రభుత్వం కాజేసి ఆ భూమి పై ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పెట్టుబడిదారులకు అప్పగించారని అన్నారు. నాటి నుంచి మత్స్యకారులు అలుపెరగని పోరాటం చేస్తూ తమ ఉద్యమం కొనసాగించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉద్యమాల ద్వారా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రజలు తీవ్రవ్యతిరేఖించి నిర్మాణాన్ని నిలిపివేశాలని గుర్తు చేశారు . ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పని చేసిన నాయుకులు ఈనాడు అధికారంలో ఉన్నారని వారు దీనిపై సమాధానం చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరవీరులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని , ఇప్పటికైనా 1108 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల భూములు తిరిగి వాళ్లకే అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం నాయకులు ఎన్ వెంకట్రావు, ధర్మల్ పోరాట నాయకులు మండపాక నరసింగరావు, సురాడ రాజారావు, కోత శంకర్ ప్రసాద్, పరపటి రాజారావు,హన్నురావు, కేశవ ,కత్రో, సిమ్మ సోమేశ్, మండల గన్ను, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.










