ఎఫ్‌డిఐ నిబంధనల సడలింపు యోచన
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, ఖనిజ వనరులను విదేశీ, ప్రయివేటు శక్తులకు విక్రయిస్తూ వస్తోన్న మోడీ సర్కార్.. తాజాగా భారత అంతరిక్ష రంగంలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వీలుగా నిబంధనలను మరింత సులభతరం చేయాలని యోచిస్తోంది. ఇదే విషయాన్ని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) సెక్రటరీ రాజేష్ కుమార్ వెల్లడించారు. అంతరిక్ష రంగంలో ఎఫ్‌డిఐ నిబంధనలను మరింత సరళీకరించే అవకాశాలున్నాయన్నారు. కొన్ని రంగాలు సహా దాదాపు అన్నిటిలోనూ ఎఫ్‌డిఐల సరళీకరణలో భారత్ తన లక్ష్యాన్ని చేరుకుందని రాజేష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో ఎఫ్‌డిఐలకు అవదులు లేకుండా చేశామన్నారు. ఇదే క్రమంలో అంతరిక్ష రంగంలోనూ మార్పులు చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో ఉపగ్రహాల స్థాపనలో మాత్రమే ఎఫ్‌డిఐలకు 100 శాతం అనుమతి ఉంది. ఎఫ్‌డిఐ నిబంధనలను మరింత సడలిస్తే ఇస్త్రో లాంటి కీలక సంస్థలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.