లాసన్నె: ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బిడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో భారత షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ సత్తా చాటారు. ఈ సీజన్‌లో అత్తుత్తమ ప్రదర్శన చేస్తున్న ప్రణయ్ 9వ స్థానంలో, లక్ష్యసేన్ 11వ ర్యాంకుకు ఎగబాకారు. ఇటీవల ముగిసిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో వీరిద్దరు అదరగొట్టారు. లక్ష్యసేన్ సెమీస్‌కు చేరాడు. దీంతో అతడు 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ ఒక అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం అతను 19వ ర్యాంక్‌లో ఉన్నాడు. నేషనల్ చాంపియన్ మిధున్ మంజునాథ్ ఏకంగా నాలుగు స్థానాలు ఏగబాకి 50వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 17వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఆడిన ప్రతి టోర్నమెంట్‌లో క్వార్టర్స్ కూడా దాటలేకపోయిన ఆమెకు గత పదేళ్లలో ఇదే తక్కువ ర్యాంక్. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి రెండో సీడ్ నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది వీళ్లు కొరియా ఓపెన్‌తో కలిపి మూడు వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించారు. దీంతో వీరు మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ, గాయత్రీ గోపిచంద్ 17వ ర్యాంక్‌లోనే కొనసాగుతున్నారు.










