Oct 27,2023 09:56

హాంగ్‌జౌ : చైనాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్‌ పతక దూకుడు కొనసాగిస్తోంది. ఈ క్రీడల్లో గురువారంతో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 80కు చేరుకుంది. ఇందులో 18 బంగారు, 23 రజతాలు, 39 కాంస్య పతకాలు ఉన్నాయి. 2018లో భారత్‌ ఈ క్రీడల్లో 72 పతకాలు (15 బంగారం, 24 రజతం, 33 కాంస్య) సాధించింది. ఇప్పటి వరకూ అదే అత్యధికం. తాజా క్రీడల్లో భారత్‌ తన రికార్డును తానే అధిగమించింది. గరువారం ముందుగా సచిన్‌ సర్జేరావు ఖిలారి స్వర్ణం సాధించాడు. పురుషుల ఎఫ్‌46 షాట్‌పుట్‌లో 16.03 మీటర్లు (ఈ గేమ్స్‌లో రికార్డు) విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన రోహిత్‌ కుమార్‌ 14.56 మీటర్లు విసిరి కాంస్యం సొంతం చేసుకున్నాడు. అలాగే ఆర్‌6 మిక్స్‌డ్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో సిదార్థ బాబు 247.7 పాయింట్లతో భారత్‌కు మరో బంగార పతకం అందించాడు. సీతల్‌ దేవి-రాకేష్‌ కుమార్‌ల కామ్‌పౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కూడా బంగారు పతకం సాధించింది. మిగిలి అంశాల్లో కూడా భారత్‌ పారా క్రీడాకారులు పతకాలు సాధించడంతో పతకాలు సంఖ్య 80కు చేరుకుంది. ఈ క్రీడలు ఇంకా రెండు రోజుల పాటు జరుగుతుండటంతో భారత్‌ పతకాల సంఖ్య 100 దాటుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.