న్యూజెర్సీ : అమెరికాలో భారత సంతతికి చెందిన కుటుంబం దారుణ హత్యకు గురైంది. అమెరికాలోని న్యూజెర్సీ ప్లెయిన్స్‌బోరోలోని తన సొంత ఇంట్లోనే తేజ్ ప్రతాప్‌సింగ్ (43), సోనాల్ పరిహార్ (42), వారి పదేళ్ల కుమారుడు ఆయుష్, ఆరేళ్ల కూతురు అరీలు ఇంట్లో రక్తపు మడుపులో విగతజీవులుగా కనిపించారని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ బుధవారం సాయంత్ర 4.30 గంటల తర్వాత ఈ కుటుంబం హత్యకు గురైనట్లు ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్ అనుమానం వ్యక్తం చేసింది. తేజ్ ప్రతాప్‌సింగ్ సొంతూరు ఉత్తూరప్రదేశ్‌లోని జలౌన్ అని తెలిసింది. ఇక ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మిడిల్‌సెక్స్ కౌంటి ప్రాసిక్యూటర్ యోలాండా సికోన్, ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఎమోన్ బ్లాన్‌చార్డ్ గురువారం ప్రకటించారు. సింగ్ కుటుంబ హత్యపై ప్లెయిన్స్‌బోరో మేయర్ పీటర్ కాంటు విచారం వ్యక్తం చేశారు.
కాగా, ఈ నెల 4న సాయంత్రం తమ ఫోన్‌కాల్‌కు సింగ్ దంపతులు స్పందించకపోవడంతో అనుమానమొచ్చి బంధువులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ సమాచారం మేరకు పోలీసులు ఇంటికెళ్లి చూడగా సింగ్ దంపతులు, పిల్లలు హత్యకు గురైనట్లు తెలిసింది. ప్రతాప్‌సింగ్ దంపతులిద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారని వారి బంధువులు తెలిపారు. వాషింగ్టన్ డిసిలో ఓ ప్రైవేటు పాఠశాల రివర్ స్కూల్‌లో సింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. ఈ చిన్నారులు హత్యకు గురికావడంపై ఆ స్కూల్ సూపరింటెండెంట్ డేవిడ్ అడెర్హోల్డ్ విచారం వ్యక్తం చేశారు.