Sep 04,2023 23:58

ఆసియా కప్-2023 టోర్నీలో భారత్ తొలి విజయం నమోదు చేసింది. వర్షం వల్ల అంతరాయం కలిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్ పై ఘనంగా గెలిచింది. శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ గ్రూప్-ఏ పోరులో టాస్ గెలిచిన భారత్... నేపాల్ కు బ్యాటింగ్ అప్పగించింది. నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా లక్ష్యఛేదనలో వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని కుదించారు. డక్ వర్త్ లూయిస్ విధానంలో భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేయగా, గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు. గిల్ 8 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. చివర్లో గిల్ ఫోర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు.

231 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా 2.1 ఓవర్లలో 17 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం కురవడంతో దాదాపు 2 గంటల పాటు ఆట నిలిచిపోయింది.. దీంతో విలువైన సమయం కోల్పోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్ణయించారు అంపైర్లు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నేపాల్ ఓపెనర్లు 9.5 ఓవర్లజరుగుతున్లో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్‌ షేక్‌ (58), సోంపాల్‌ కామీ (48), కుషాల్‌ భుర్టెల్‌ (38), దీపేంద్ర సింగ్‌ (29), గుల్షన్‌ ఝా (23) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఈ విజయంతో భారత్ సూపర్-4 దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్-4లో అడుగుపెట్టింది. కాగా, గ్రూప్ దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం కాగా, సూపర్-4 దశలో దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచిన పాక్... రెండో స్థానంలో నిలిచిన భారత్ సెప్టెంబరు 10న కొలంబోలో తలపడనున్నాయి. 

  • ఇండియా -నేపాల్‌ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

ఆసియా కప్‌ 2023 టోర్నీని వరుణుడు వదిలిపెట్టడం లేదు. ఇండియా - పాకిస్తాన్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దు కాగా, ఇండియా- నేపాల్‌ మ్యాచ్‌ని కూడా వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచే సమయానికి 37.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి నేపాల్‌ 178 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ మొదలెట్టిన నేపాల్‌కి భారత ఫీల్డర్ల చెత్త ఫీల్డింగ్‌ బాగా కలిసి వచ్చింది. మొదటి 5 ఓవర్లలో టీమిండియా ఫీల్డర్లు 3 క్యాచులను డ్రాప్‌ చేశారు. దీన్ని వాడుకున్న నేపాల్‌ ఓపెనర్లు 9.5 ఓవర్లలో తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు.. 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన కుశాల్‌ బుర్టెల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. 17 బంతుల్లో 7 పరుగులు చేసిన భీం శక్తిని రవీంద్ర జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 8 బంతుల్లో 5 పరుగులు చేసిన నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌ పాడెల్‌ కూడా జడ్డూ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.. 5 బంతుల్లో 2 పరుగులు చేసిన కుశాల్‌ మల్ల, జడ్డూ బౌలింగ్‌లో సిరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. వెంటవెంటనే 3 వికెట్లు కోల్పోయింది నేపాల్‌. 65/0 స్థితిలో ఉన్న నేపాల్‌, 101/4 స్థితికి చేరుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన ఓపెనర్‌ ఆసిఫ్‌ షేక్‌ 97 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు చేసి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు.. హాఫ్‌ సెంచరీ తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు ఆసిఫ్‌ షేక్‌. 35 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన గుల్షాన్‌ జా కూడా మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లోనే ఇషాన్‌ కిషన్‌ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్‌ చేరాడు. 144 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది నేపాల్‌. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి దీపేంద్ర సింగ్‌ ఆరీ 20 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు, సోమ్‌పాల్‌ కమీ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే ఏడో వికెట్‌కి 36 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

  • టాస్‌ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్‌

ఆసియా కప్‌లో భాగంగా ఈ రోజు టీమిండియా-నేపాల్‌ జట్ల మధ్య పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ రోజు మ్యాచ్‌ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. బుమ్రా స్థానంలో షమీ జట్టులోకి వచ్చినట్లు తెలిపారు. అటు నేపాల్‌ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు నేపాల్‌ సారథి రోహిత్‌ పౌడేల్‌ తెలిపాడు. ఆరిఫ్‌ షేక్‌ స్థానంలో భీమ్‌ షర్కీ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.

తుది జట్లు ఇవే
టీమిండియా: 
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌.

నేపాల్‌ : కుశాల్‌ భుర్తేల్‌, ఆసిఫ్‌ షేక్‌(వికెట్‌ కీపర్‌), రోహిత్‌ పౌడెల్‌(కెప్టెన్‌), భీమ్‌ షార్కి, సోంపాల్‌ కామి, గుల్సన్‌ ఝా, దీపేంద్ర సింగ్‌ ఐరీ, కుశాల్‌ మల్లా, సందీప్‌ లమిచానే, కరణ్‌ కేసీ, లలిత్‌ రాజ్‌బన్షీ.