Oct 18,2023 22:20

మధ్యాహ్నం 2.00గం||ల నుంచి
పూణే: వరుసగా మూడు మ్యాచుల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌.. సెమీస్‌ దిశగా దూసుకెళ్తోంది. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే నాల్గో మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్‌ వన్డే ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని జట్టుగా నిలవనుంది. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ జట్లు తొలి రెండు మ్యాచుల్లో నెగ్గినా.. మూడో మ్యాచ్‌లో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూశాయి. దక్షిణాఫ్రికా జట్టు పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో ఓడితే.. ఇంగ్లండ్‌ జట్టు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైంది.
షమీ, అశ్విన్‌లకు చోటుదక్కేనా..?
స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసర్‌ మహ్మద్‌ షమీలు బంగ్లాతో పోరుకు బరిలోకి దిగడం ఖాయంగా కనబడుతోంది. పూణే పిచ్‌ను స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండేలా కొత్త పిచ్‌ను రూపొందించారు. స్పిన్‌కు అనుకూలం దృష్ట్యా కుల్దీప్‌ యాదవ్‌తో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌నూ తుదిజట్టులోకి రావొచ్చు. మరోవైపు పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా స్థానంలో మహ్మద్‌ షమీ వచ్చినా ఆశ్చర్యపోన్నక్కర్లేదు. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే.. శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌కు చోటు పక్కా. ఇక అశ్విన్‌.. స్పిన్‌కు అనుకూలంగా ఉండే చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. కానీ ఆ తర్వాత అఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక షమీ వన్డే ప్రపంచకప్‌లో ఇంతవరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.
ప్రేక్షకుల ప్రవర్తనపై చర్యల్లేవు: ఐసిసి
పాకిస్తాన్‌తో జరిగిన ఐసిసి వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ప్రేక్షకుల ప్రవర్తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని ఐసిసి తాజాగా వెల్లడించింది. అహ్మదాబాద్‌లో భారత్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు అతిగా ప్రవర్తించారంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌బోర్డు(పిబిసి) ఐసిసికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఐసిసి ఇది వివక్ష వ్యతిరేక కోడ్‌ క్రిందకు రాదని, ప్రేక్షకులు సామూహికంగా, గుంపులుగా చేసే చర్యలను పరిగణనలోకి తీసుకోలేమి ఐసిసి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
జట్లు(అంచనా)..
భారత్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లీ, శ్రేయస్‌, కెఎల్‌ రాహుల్‌, జడేజా, హార్ధిక్‌/షమీ, శార్దూల్‌, కుల్దీప్‌, బుమ్రా/షమీ, సిరాజ్‌.
బంగ్లాదేశ్‌: షకీబ్‌(కెప్టెన్‌), ముష్ఫికర్‌, తస్కిన్‌ అహ్మద్‌, మెహిదీ హసన్‌, నజ్ముల్‌, మహ్మదుల్లా, ముస్తాఫిజుర్‌, షోహిబుల్‌, హసన్‌ మహ్మద్‌, నసూమ్‌ అహ్మద్‌.