Oct 15,2022 08:37
  • 121 దేశాల్లో 107వ ర్యాంక్‌
  • పాక్‌, శ్రీలంక కంటే దిగువన

న్యూఢిల్లీ : ఆకలి సూచీలో భారత్‌ అట్టడుగున ఉంది. 121 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో భారత్‌ 107వ స్థానంలో ఉంది. శ్రీలంక (64వ ర్యాంక్‌), నేపాల్‌ (81), బంగ్లాదేశ్‌ (84), పాకిస్థాన్‌ (99) మన దేశం కన్నా ముందున్నాయి. దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్‌ (109 ర్యాంక్‌) మాత్రమే భారత్‌ కన్నా దిగువన ఉంది. భారత్‌లో చైల్డ్‌ వేస్టింగ్‌ రేటు 19.3 శాతంతో ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. 2014 (15.1 శాతం), 2000 (17.15 శాతం) కంటే అధ్వానంగా ఉంది. భారత్‌లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది.
          భారత్‌లో చైల్డ్‌ వేస్టింగ్‌ రేట్‌ (వయసు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండటం) 19.3 శాతంతో ప్రపంచంలోనే అత్యంత తీవ్రంగా ఉంది. ఈ గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ (జిహెచ్‌ఐ) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయస్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, చైల్డ్‌ వేస్టింగ్‌, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జిహెచ్‌ఐలో స్కోరు ఇస్తారు. ఈ స్కోర్లు ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, అత్యంత ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. భారత్‌కు 29.1 శాతం స్కోరుతో 'తీవ్రమైన దేశాలు'లో ఉంది.
          2018-2020లో దేశంలో పోషకాహార లోపం 14.6 శాతంగా ఉండగా, 2019-2021 నాటికి ఇది 16.3 శాతానికి పెరిగింది. అంటే దేశంలో 22 కోట్ల 40 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 44 దేశాలు తీవ్రం, ఆందోళన కేటగిరీల్లో ఉన్నాయని జిహెచ్‌ఐ తెలిపింది.