Oct 28,2023 22:30

ముగిసిన ఆసియా పారా క్రీడలు
హాంగ్జౌ: 4వ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. చైనాలోని హాంగ్జౌలో శనివారంతో ముగిసిన ఆసియా పారా క్రీడల్లో భారత్‌ ఈసారి రికార్డుస్థాయిలో 111పతకాలు చేజిక్కించుకొని సత్తాచాటింది. ఈ క్రీడల చరిత్రలో భారత్‌కు ఇన్ని పతకాలు దక్కడం ఇదే తొలిసారి. ఇందులో 29స్వర్ణ, 31రజత, పతకాలతో పాటు మరో 51 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక చివరిరోజు భారత్‌కు 12పతకాలు దక్కాయి. ఇందులో మహిళల పారా చెస్‌లో సంకృతి, హిమాన్షు, వృద్ధి కాంస్య పతకాన్ని సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో సౌందర్య ప్రధాన్‌ రజతంతోపాటు పురుషుల టీమ్‌ బి-1 కేటగిరీలో అశ్విన్‌, దర్పన్‌, సౌందర్య స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నారు. ఇక పురుషుల పారా జావెలిన్‌లో నీరజ్‌ యాదవ్‌(స్వర్ణం), టెక్‌చంద్‌(కాంస్యం) సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ స్కల్స్‌ పిఆర్‌-3లో నారాయణ, అనిత రజతం పతకంతో మెరిసారు. 2018 జకార్తా వేదికగా జరిగిన ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 72పతకాలు మాత్రమే దక్కగా ఈసారి మరో 39పతకాలు అధికంగా వచ్చాయి. అథ్లెటిక్స్‌ విభాగంలోనే ఈసారి ఏకంగా 55పతకాలు దక్కడం మరో విశేషం. ఈ సందర్భంగా భారత పారా ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షులు దీపా మాలిక్‌ మాట్లాడుతూ.. భారత్‌కు అత్యధిక పతకాలు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

  • పతకాల పట్టిక

వ.స  దేశం   స్వ    ర     కా   మొ
1.    చైనా    214 167 140  521
2.   ఇరాన్‌   44  46    41  131
3.   జపాన్‌   42 49    59  150
4.  ద.కొరియా 30 33  40  103
6.  ఇండియా  29  31  51  111
5. ఇండోనేషియా 29 30 36  95
7.  థాయ్ లాండ్‌ 27 26 55 108
8.  ఉజ్బెకిస్తాన్‌  25  24  30  79
9.  ఫిలిప్పీన్స్‌  10  4 5  19
10. హాంకాంగ్‌   8 15 24 47