Sep 25,2023 11:24

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఐరాస 78వ సర్వసభ్య సమావేశాల్లో పాకిస్తాన్‌ మరోసారి కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి భారత్‌ దీటుగా జవాబిచ్చింది. సమావేశంలో ఆదివారం నాడు పాకిస్తాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్‌ కాకర్‌ కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కాశ్మీర్‌లో అక్రమ ఆక్రమణలను భారత్‌ ఖాళీ చేయాలని అన్నారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి పటేల్‌ గెహ్లట్‌ స్పందిస్తూ 'నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. మానవ హక్కుల విషయంలో తన దారుణమైన రికార్డు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఈ కుయుక్తులని అందరికీ తెలుసు. జమ్ముకాశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలు భారత్‌లోని అంతర్భాగాలని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అక్కడి విషయాలు మా అంతర్గత వ్యవహారం. ఆ విషయాలపై మాట్లాడటానికి పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదు. దక్షిణాసియాలో శాంతియుత పరిస్థితుల కోసం పాక్‌ ముందుగా మూడు పనులు చేయాల్సి ఉంది. ఒకటి.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు. ఉగ్రకార్యకలాపాలను నిలిపివేయాలి. రెండు.. తన దురాక్రమణలో ఉన్న భారత భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలి. మూడు.. పాకిస్తాన్‌లో మైనార్టీల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి' అని పటేల్‌ గెహ్లాట్‌ సూచించారు.