Sep 11,2023 23:53

ఆసియా కప్ సూపర్-4లో టీమిండియా అదరగొట్టింది. పాకిస్థాన్‌ను 228 పరుగుల తేడాతో ఓడించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన మ్యాచులో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి పాక్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీతం 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగలు చేసింది. కోహ్లీ (122; 94 బంతుల్లో, 9x4, 3x6), రాహుల్ (111; 106 బంతుల్లో, 12x4, 2x6), గిల్ (58; 52 బంతుల్లో, 10x4), రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో, 6x4, 4x6) రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆరంభంలోనే తేలిపోయింది. భారత బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి.. ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు. ఫలితంగా 32 ఓవర్లలోనే 128 పరుగులకు పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. పాక్ బ్యాటర్లలో నసీమ్ షా, హరీస్ రవూఫ్ బ్యాటింగ్ చేయలేదు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఇరువురూ బ్యాటింగ్‌కు దిగలేదు. దీంతో 8 వికెట్ల పడగొట్టి భారత్ గెలుపొందింది. బుమ్రా, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. 

  • సెంచరీలతో చెలరేగిన కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహీ.. 

ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్స్‌ కెఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి అజేయ శతకాలతో మెరిసారు. ఆదివారం మ్యాచ్‌కు కొనసాగింపుగా సోమవారం జరిగే ఈ మ్యాచ్‌కు తొలుత వర్షం ఆటంక పరిచింది. దీంతో 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులతో రిజర్వుడే అయిన సోమవారం మ్యాచ్‌ను కొనసాగించిన టీమిండియా 50 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 356పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కెఎల్‌ రాహుల్‌(111పరుగులు; 106బంతుల్లో 12ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్‌ కోహ్లి(122పరుగులు; 94బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ మరోవికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 3వ వికెట్‌కు 233పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లి 84 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, కెఎల్‌ రాహుల్‌ 100 బంతుల్లో 10ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీలను పూర్తి చేసుకున్నారు. మొత్తమ్మీద కెఎల్‌ రాహుల్‌ 106 బంతుల్లో 111 పరుగులు, కోహ్లి 94 బంతుల్లో 122 పరుగులు చేసి అజేయంగా క్రీజ్‌లో నిలిచారు. దీంతో భారతజట్టు నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కాగా విరాట్‌ కోహ్లికి వన్డేల్లో 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మూడు ఫార్మాట్లలో కలిపి 77వ సెంచరీ.
భారీ లక్ష్య ఛేదనలో భాగంగా పాకిస్తాన్‌ జట్టు 11 ఓవర్లలో 44పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచింది.

  • ఆసియాకప్‌లో రికార్డు భాగస్వామ్యం

విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ కలిసి ఆసియాకప్‌ చరిత్రలో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రేమదాస స్టేడియంలో సోమవారం పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో వీరిద్దరూ 3వ వికెట్‌కు 233పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన హఫీజ్‌-జంషేడ్‌ తొలి వికెట్‌కు 224పరుగుల రికార్డును వీరు బ్రేక్‌ చేశారు. ఆ తర్వాత యూనిస్‌ ఖాన్‌-షోయబ్‌ మాలిక్‌(214 పరుగులు), ఇప్తికార్‌-బాబర్‌(214పరుగులు), రహానే-కోహ్లి(213పరుగులు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

  • సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కింగ్‌ కోహ్లి...

టీమిండియా రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లి వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో వేగంగా 13వేల పరుగుల మార్క్‌ను అందుకున్న దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. కోహ్లి 13వేల పరుగుల మార్క్‌ను 277ఇన్నింగ్స్‌లో చేరుకోగా.. సచిన్‌ టెండూల్కర్‌ ఆ మార్క్‌ను 321 ఇన్నింగ్స్‌లో చేశాడు. పాకిస్తాన్‌పై 122పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్‌ కోహ్లి(47 సెంచరీలు) వన్డే కెరీర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండ్కూర్‌(50 సెంచరీలు)కు చేరువయ్యాడు. అలాగే వన్డేల్లో 13వేల మార్క్‌కు చేరుకున్న ఆటగాళ్లలో రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా) 341 ఇన్నింగ్స్‌ మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే విరాట్‌ కోహ్లీ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈతరం ఆటగాళ్లలో ఎక్కువ సార్లు ఒకే ఏడాది 1000కి పైగా పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ రెండోస్థానంలో నిలిచాడు. కోహ్లీ ఒక ఏడాదిలో 1000కి పైగా పరుగులు చేయడం 15ఏళ్లలో ఇది 12వ సారి. ఓవరాల్‌గా సచిన్‌ 16 సార్లు ఒకే ఏడాది వెయ్యికి పైగా పరుగులుచేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇండియా ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి)ఫహీమ్‌ (బి)షాదాబ్‌ 56, శుభ్‌మన్‌ (సి)అఘా సల్మాన్‌ (బి)షాహిన్‌ అఫ్రిది 58, కోహ్లి (నాటౌట్‌) 122, రాహుల్‌ (నాటౌట్‌) 111, అదనం 9. (50 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 356పరుగులు.
వికెట్ల పతనం: 1/121, 2/123
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 10-0-79-1, నసీమ్‌ షా 9.2-1-53-0, ఫహీమ్‌ 10-0-74-0, రవూఫ్‌ 5-0-27-0, షాదాబ్‌ 10-1-71-1, ఇప్తికార్‌ 5.4-0-52-0
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫకర్‌ జమాన్‌ (నాటౌట్‌) 14, ఇరామ్‌ ఉల్‌ హక్‌ (సి)శుభ్‌మన్‌ (బి)బుమ్రా 9, బాబర్‌ (బి)హార్దిక్‌ (10), రిజ్వాన్‌ (నాటౌట్‌) 1, అదనం 10. (11 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 44పరుగులు.
వికెట్ల పతనం: 1/17, 2/43
బౌలింగ్‌: బుమ్రా 5-1-18-1, సిరాజ్‌ 5-0-23-0, హార్దిక్‌ 1-0-1-1

  • కెఎల్‌ రాహుల్‌, కోహ్లి శతకాలు.. భారత్‌ 356/2

ఆసియా కప్‌ 2023 సూపర్‌ 4 మ్యాచ్‌లో టీమిండియాకి భారీ స్కోరు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి (122 నాటౌట్‌) శతకాలు, రోహిత్‌ (56), శుభ్‌మన్‌ గిల్‌ (58) కూడా హాఫ్‌ సెంచరీలు చేయడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 24.1 ఓవర్లలో 147/2 స్కోరుతో రిజర్వు డే ఆటని కొనసాగించిన భారత బ్యాటర్లు రాహుల్‌, కోహ్లీ.. పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. విరాట్‌ కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు చేయగా.. కెఎల్‌ రాహుల్‌ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ 194 బంతుల్లో 233 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది టీమిండియా. వన్డేల్లో పాకిస్తాన్‌పై టీమిండియాకి ఇదే అత్యధిక స్కోరు. గాయం నుంచి కోలుకున్న తర్వాత మొదటి మ్యాచ్‌ ఆడుతున్న కెఎల్‌ రాహుల్‌ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో కెఎల్‌ రాహుల్‌కి ఇది ఆరో సెంచరీ.. విరాట్‌ కోహ్లీ వన్డేల్లో 47వ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.

Innings Break!

A brilliant opening partnership between @ImRo45 & @ShubmanGill, followed by a stupendous 233* run partnership between @imVkohli & @klrahul as #TeamIndia post a total of 356/2 on the board.

Scorecard - https://t.co/kg7Sh2t5pM#INDvPAK pic.twitter.com/2eu66WTKqz

  • విరాట్‌ శతకం..

రాహుల్‌ శతక్కొట్టిన మరుసటి ఓవర్‌లోనే విరాట్‌ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. 47.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 322/2.

  • కేఎల్‌ రాహుల్‌ 100

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో సత్తా చాటాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్‌ 100 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.

  • కోహ్లి అర్ధసెంచరీ.. టీమిండియా : 251/2

విరాట్‌ కోహ్లి 55 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 251/2గా ఉంది. రాహుల్‌ (71), కోహ్లి (57) క్రీజ్‌లో ఉన్నారు.

  •  37 ఓవర్లలో టీమిండియా స్కోరు: 231/2

ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య ఆట మొదలైంది. ఆదివారం వర్షం కారణంగా 24.2 ఓవర్ల దగ్గర ఆగిపోయిన ఆటను సోమవారం(రిజర్వ్‌ డే) ఆట ప్రారంభించిన కేఎల్‌ రాహుల్‌, కోహ్లి దాటిగా బ్యాటింగ్‌ చేసున్నారు. రాహుల్‌ 65, కోహ్లీ 44 పరుగులు చేశారు. 37 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 231/2గా ఉంది.

  • ప్రారంభమైన ఇండియా - పాకిస్తాన్‌ మ్యాచ్‌...

ఆసియా కప్‌ 2023 టోర్నీ సూపర్‌ 4 రౌండ్‌లో భాగంగా కొలంబోలో జరుగుతున్న ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌.. తిరిగి ప్రారంభమైంది. కొలంబోలో కురుస్తున్న వర్షాల కారణంగా మొదటి రోజు 24.1 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు, రెండో రోజు అక్కడి నుంచే బ్యాటింగ్‌ మొదలెట్టింది. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ కడుపు నొప్పితో బాధపడుతుండడంతో నేడు బౌలింగ్‌ చేయడం లేదని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలియచేశాడు.

  • భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. కొలంబోలో మళ్లీ వర్షం...
  • మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది
  • rain

కొలంబో : ఆసియా కప్‌ 2023 టోర్నీలో ఇండియా - పాకిస్తాన్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఆసియా కప్‌ గ్రూప్‌ మ్యాచ్‌ వర్షార్పణం కాగా... నిన్నటి సూపర్‌-4 మ్యాచ్‌ కూడా వాన దెబ్బకు గురైంది. ఆ మ్యాచ్‌ కు నేడు రిజర్వ్‌ డే కాగా, నిన్న నిలిచిపోయిన మ్యాచ్‌ను ఇవాళ కొనసాగించాలని నిర్ణయించారు. కానీ శ్రీలంక రాజధాని కొలంబోలో ఇవాళ కూడా వర్షం పడుతోంది. దాంతో దాయాదుల మ్యాచ్‌ కు వేదికపైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఓసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్‌ మొదలవుతుందన్న ఆశలు మొలకెత్తాయి. అయితే ఆ ఆనందం కాసేపే అయింది. మళ్లీ వర్షం మొదలవడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కావాల్సి ఉండగా, అంపైర్లు మైదానాన్ని పరిశీలించిన తర్వాత ఆట కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.