Oct 03,2023 21:07
  • 2023-24లో ప్రపంచ బ్యాంక్‌ అంచనా
  • గతేడాది 7.2 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు పడిపోనుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ప్రపంచ బ్యాంక్‌ తాజా రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతోన్నామని ప్రధానీ మోడీ పదేపదే చెబుతున్న మాటలకు భిన్నంగా ఈ అంచనాలు వెలుపడటం గమనార్హం. ఇంతక్రితం 2022-23లో భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.2 శాతంగా నమోదయ్యిందని ప్రపంచ బ్యాంక్‌ విడుదల చేసిన ఇండియా డెవలప్‌మెంట్‌ అప్‌డేట్‌ (ఐడియు) రిపోర్ట్‌లో గుర్తు చేసింది. 2021-22లో 9.1 శాతం వృద్థి చోటు చేసుకుంది. ''ప్రపంచవ్యాప్త ప్రతికూల వాతావరణం స్వల్పకాలికంగా సవాళ్లను విసురుతూనే ఉంటుంది... ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం వల్ల ఎక్కువ మంది ప్రయివేటు పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో ప్రపంచ అవకాశాలను చేజిక్కించుకోవడానికి భారత్‌కు అవకాశాలున్నాయి.'' అని ప్రపంచ బ్యాంకు ఇండియా కంట్రీ డైరెక్టర్‌ అగస్టే టానో కౌమే పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన రిపోర్టులో కూడా భారత వృద్థి రేటు 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌కు అద్దం పట్టే తయారీ రంగం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1.3 శాతం పెరుగుదలకు పరిమితమయ్యింది. ఇంతక్రితం ఏడాది ఈ రంగం ఏకంగా 11.1 శాతం వృద్థిని కనబర్చింది. ''ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయివేటు రంగ పెట్టుబడుల్లో తగ్గుదల చోటు చేసుకోవచ్చు. బ్యాంక్‌ల రుణాల జారీ, నిర్మాణ రంగంలో పెద్ద పురోగతి ఉండకపోవచ్చు. వర్షాభావం వల్ల పలు ఉత్పత్తుల ధరలు పెరిగి.. ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో స్టాక్‌ మార్కెట్లు దిద్దుబాటుకు గురైయ్యే అవకాశాలున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో మాత్రం మొండి బాకీలు తగ్గి.. లాభాదాయకతలో మెరుగుదలను ప్రదర్శిస్తున్నాయి.'' అని ఆర్థిక శాఖ రిపోర్ట్‌లో పేర్కొంది.