Feb 18,2023 21:23

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒక్కటైన ఇండిగో ఏకంగా 500 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలిపింది. తమ సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ విమానాల కోసం ఎయిర్‌బస్‌కు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చామని ఇండిగో ఇంటర్నేషనల్‌ సేల్స్‌ హెడ్‌ వినరు మల్హోత్రా తెలిపారు. ఇండియా, ఇస్తాంబుల్‌, యూరప్‌ ప్రాంతాల మధ్య ప్యాసింజర్‌ సర్వీసులను పెంచనున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థ రోజుకు 1,800 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఇందులో 10 శాతం విదేశీ రూట్లలో తిరుగుతున్నాయన్నారు. ఈ సంస్థకు ప్రస్తుతం 300 విమానాలు ఉన్నాయి. దేశీయంగా 76, అంతర్జాతీయంగా 26 గమ్యస్థానాలకు సేవలను అందిస్తుంది.