ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేయనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ తెలియజేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్మికులతో కలిసి గురువారం పురపాలక కార్యాలయంలో మేనేజర్ శేష ఫణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకుంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి నాలుగేళ్లు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. సిపిఎస్ పరిష్కరించాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఒకటవ తేదీ నుంచి సమ్మెలోకి దిగనున్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టు ఏడవ తేదీన మునిసిపల్ కార్మికులతో ఛలో రాయచోటి ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ ఐక్యంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల జిల్లా అధ్యక్షులు సి.హెచ్ ఓబయ్య, ప్రధాన కార్యదర్శి కె.ప్రసాద్, కోశాధికారి డి.లక్ష్మీదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










