Jul 28,2023 09:14
  • సగానికి పైగా ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విద్యార్థులే

న్యూఢిల్లీ : 2019-2023 మధ్యకాలంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, కేంద్ర యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 32 వేల మందికి పైగా విద్యార్థులు మధ్యలోనే చదువులకు స్వస్తి చెప్పారు. రాజ్యసభకు అందజేసిన సమాచారంలో కేంద్ర విద్యా శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. చదువులను మధ్యలోనే వదిలేస్తున్న వారిలో ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఇతర వెనుకబడిన తరగతుల వారు సగానికి పైగా ఉన్నారని వివరించింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ సమాధానమిస్తూ కేంద్ర యూనివర్సిటీలలోనే అత్యధిక డ్రాపవుట్లు (17,454) చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఐఐటీల నుంచి 8,139, ఎన్‌ఐటీల నుండి 5,623, ఐఐఎస్‌ఈఆర్‌ నుండి 1,046, ఐఐఎంల నుంచి 858, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నుంచి 803, స్కూల్స్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ నుంచి 112 మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేసి వెళ్లిపోయారని ఆయన వివరించారు. డ్రాపవుట్లలో 52 శాతం మంది ఎస్‌సిలు (4,423), ఎస్‌టిలు (3,774), ఒబిసిలు (8,602) ఉన్నారని అన్నారు.
        కోర్సులను ఎంచుకోవడంలో తప్పిదాలు, పనితీరు సరిగా లేకపోవడం, వ్యక్తిగత-ఆరోగ్య కారణాల వల్ల అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లలో డ్రాపవుట్లు అధికంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు లభించడం, మెరుగైన అవకాశాల కోసం వేరే కోర్సులు ఎంచుకోవడం కూడా డ్రాపవుట్లకు కారణమవుతున్నాయని వివరించారు. డ్రాపవుట్ల సంఖ్యను తగ్గించేందుకు ఉన్నత విద్యా సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయని సుభాష్‌ సర్కార్‌ చెప్పారు.