Nov 01,2023 09:46

ప్రథమార్థంలో రూ.7.02 లక్షల కోట్లకు చేరిక
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థం (హెచ్‌1)లో కేంద్ర ప్రభుత్వ విత్త లోటు 7.02 లక్షల కోట్లకు చేరింది. దీంతో మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో 39.3 శాతానికి చేరినట్లయ్యింది. గతేడాది ఇదే కాలంలో 37.3 శాతంతో పోల్చితే స్వల్పంగా లోటు పెరిగింది. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ.. చేసే వ్యయాల మధ్య అంతరమే విత్త లోటు. కాగా.. 2023 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ ముగింపు నాటికి ఇది రూ.7.02 లక్షల కోట్లుగా నమోదయ్యిందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సిజిఎ) గణంకాల్లో వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం 2023ా24 జిడిపిలో 6.4 శాతంతో రూ.17.87 లక్షల కోట్ల విత్త లోటు చోటు చేసుకోవచ్చని కేంద్రం బడ్జెట్‌లో అంచనా వేసింది. ఇంతక్రితం ఏడాదిలోనూ 6.4 శాతంగా చోటు చేసుకుంది. సెప్టెంబర్‌ ముగింపు నాటికి పన్ను రెవెన్యూ ప్రస్తుత వార్షిక టార్గెట్‌లో రూ.11.60 లక్షల కోట్లు లేదా 49.8 శాతాన్ని చేరింది. గతేడాది ఇదే సమయంలో బడ్జెట్‌ అంచనాల్లో 52 శాతాన్ని చేరింది. బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే క్రితం ప్రథమార్థంలో కేంద్రం మొత్తం వ్యయం 21.19 లక్షల కోట్లు లేదా 47.1 శాతంగా నమోదయ్యింది.