Jan 07,2023 10:02
  • అంతర్జాతీయ ధర కంటే ఎక్కువ చెల్లిస్తోన్న జిసిసి
  • ఆ సంస్థకే పంట విక్రయానికి గిరిజన రైతుల మొగ్గు

ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్‌ ధర కంటే కాఫీ రైతులకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఎక్కువ ధర చెల్లిస్తోంది. దీంతో, ఆ సంస్థ ద్వారా కాఫీ కొనుగోలు పెరుగుతోంది. కాఫీ సీజన్‌ ఏటా డిసెంబర్‌ నుంచి మార్చి వరకూ ఉంటుంది. గత సీజన్లో 150 టన్నుల కాఫీని కూడా కొనుగోలు చేయలేని జిసిసి ప్రస్తుత సీజన్లో ఒక్క డిసెంబర్‌ నెలలోనే అంతకంటే ఎక్కువగా కొనుగోలు చేసింది. సీజన్‌ ముగిసేందుకు మరో మూడు నెలల వరకూ సమయం ఉండడంతో కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని జిసిసి వర్గాలు చెప్తున్నాయి. ఇతర వ్యాపారులు, ఐటిడిఎ కంటే ఎక్కువ ధర ఇస్తోంది. రైతుల ఖాతాకు 24 గంటల్లో సొమ్ము జమచేస్తుండడంతో జిసిపి కొనుగోలులో భారీగా వృద్ధి కన్పిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలోని కాఫీ పంట కొనుగోలు, ధర పెంపుపై జిసిసి ఎండి సురేష్‌కుమార్‌ తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రత్యేక శ్రద్ధ ఇందుకు దోహదపడ్డాయి. పాడేరు ఏజెన్సీలోని అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్‌, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జికె వీధి, కొయ్యూరు మండలాల్లో 1.80 లక్షల మంది రైతులు దాదాపు రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వెయ్యి టన్నులకుపైగా కాఫీ కొనుగోలు చేయాలని జిసిసి లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క డిసెంబర్‌ నెలలోనే 168 టన్నుల కాఫీని గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేసింది. అరబిక పార్చ్‌మెంట్‌ కిలో కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో రూ.255 రేటు పలుకుతుండగా జిసిసి రూ.270 చెల్లిస్తోంది. వ్యాపారుల బారినపడి మోసపోకుండా గిరిజన కాఫీ రైతులను ఆదుకోవడానికి జిసిసి ఎండి చేసిన కృషి ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది పార్చ్‌మెంట్‌ కాఫీ కిలోకు రూ.270, చెర్రీకి రూ.135, రొబస్టాకు రూ.60 ధర నిర్ణయించి జిసిసి చెల్లిస్తోంది. ఈ ధరలు ఆశాజనకంగా ఉండడంతో జిసిసికి కాఫీ విక్రయించడానికి గిరిజన రైతులు మొగ్గుచూపుతున్నారు. గత నెలాఖరు నాటికి పార్చ్‌మెంట్‌ కాఫీ 149 టన్నులు, చెర్రీ రకపు కాఫీ 19 టన్నులు కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.4.28 కోట్లు ఉంది. అంతర్జాతీయంగా వియత్నాం, బ్రెజిల్‌ తదితర దేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడం, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన పాడేరు ఏజెన్సీలోని కాఫీ పంటకు మంచి గిరాకీ ఉండడంతో జిసిసి చొరవ తీసుకొని ప్రయివేటు వ్యాపారుల కంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. జిసిసి నిర్ణయించిన ధరకుమించి ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో రైతులు జిసిసి కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కాఫీని విక్రయిస్తున్నారు.

table