- క్వింటాకు రూ.850 ఎక్కువ
- రైతులపై రూ.వంద కోట్ల అదనపు భారం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసే వేరుశనగ విత్తనాల అమ్మకపు ధరను ప్రభుత్వం ఈ తడవ భారీగా పెంచేసింది. రాయలసీమలో రైతులు అత్యధికంగా సాగు చేసే కె-6 రకం విత్తనాల సేల్ ప్రైస్ నిరుటి కంటే క్వింటాలుకు రూ.850 ఎక్కువైంది. మార్కెట్‌లో అంతగా డిమాండ్ లేని కదిరి లేపాక్షి రకం విత్తనాలను ఈ మారు సేకరిస్తున్న సర్కారు దాని అమ్మకం ధరనూ అధికంగానే నిర్ణయించింది. సేల్ ప్రైస్‌ను ప్రభుత్వం అధికంగా నిర్ణయించడం వలన రైతులపై రూ.వంద కోట్ల అదనపు భారం పుడుతోంది. దానికి కొన్ని రెట్ల అదనపు సబ్సిడీ భారాన్ని సర్కారు మోయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, సబ్సిడీ వేరుశనగ విత్తనాల సేకరణ లక్ష్యాలను గతేడాది కంటే కుదించారు. ముందటేడు నాలుగున్నర లక్షల క్వింటాళ్ల సేకరణకు ప్లాన్ చేయగా, నిరుడు టార్గెట్ మూడున్నర లక్షల క్వింటాళ్లకు తగ్గించారు. అంతకంటే తక్కువ పంపిణీ చేశారు. ఈ ఏడాది ఖరీప్, రబీ కలుపుకొని మూడు లక్షల క్వింటాళ్ల సేకరణకు టెండర్లు పిలుస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, వేరుశనగ సాగుపై రైతుల అనాసక్తి వలన సేకరణ టార్గెట్‌ను తగ్గించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
- కొంత మంది జేబుల్లోకి
ఈ సంవత్సరం వేరుశనగ రైతులకు సర్కారు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) క్వింటాలుకు రూ.5,850. అంతకంటే తక్కువకే వ్యాపారులు రైతుల నుంచి సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి విత్తనాల నిమిత్తం వాటినే అధిక ధరకు సరఫరా చేస్తున్నారు. ప్రాసెసింగ్, రవాణా, ప్యాకింగ్, లేబులింగ్ వీటన్నింటినీ కలుపుకొని ఎపి సీడ్స్ ఏకంగా క్వింటాలుకు రూ.9,330గా సేల్ ప్రైస్ నిర్ణయించింది. ఎంఎస్‌పి కంటే రూ.3,480 ఎక్కువ. ఈ అదనపు అమౌంట్ వ్యాపారులు, ప్రభుత్వంలో కొంత మంది పెద్దలు, అధికారుల జేబుల్లోకి వెళుతున్నట్లు ఆరోపణలొస్తున్నారు.
- అంత ఎక్కువా?
నిర్ణయించిన సేల్ ప్రైస్ రూ.9,330లో ప్రభుత్వ రాయితీ రూ.3,720 (40 శాతం). అది పోను రైతులు రూ.5,580కి కొనుగోలు చేయాలి. నిరుడు సేల్ ప్రైస్ రూ.8,480 కాగా సబ్సిడీ రూ.3,367, రైతులు నికరంగా పెట్టుకున్నది రూ.5,580. నిరుటి కంటే ఈ సారి రైతు క్వింటాలుపై రూ.463 అదనంగా భరించాలి. ప్రభుత్వం భరించే అదనపు సబ్సిడీ రూ.353. సేకరించే మూడు లక్షల క్వింటాళ్లకు లెక్కేస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. లెక్కలు కె-6 రకం మట్టుకే. ఈ మారు వెరైటీకొక సేల్ ప్రైస్ నిర్ణయించారు. కదిరి లేపాక్షి, నారాయణి రకాలను సేకరిస్తున్నారు. వాటిల్లోనూ ఇలాంటి మతలబే చేశారని ఆరోపణలొస్తున్నాయి.
- 'రైతు నుంచి రైతు' కాన్సెప్టుకు చెల్లు
రెండేళ్ల క్రితం వరకు సబ్సిడీ విత్తనాలను రైతుల నుంచి సేకరించి రైతుకు సబ్సిడీపై అందించారు. రైతులకు గిట్టుబాటు ధర, తిరిగి పంట వేసుకోడానికి సబ్సిడీపై మేలు రకం విత్తనం అనే విధానం అమలు చేశారు. మన విత్తన గ్రామాలు, పల్లె దీపం వంటి ప్రోగ్రాముల కింద వ్యవసాయశాఖ ద్వారా విత్తనం సేకరించి, ఎపి సీడ్స్ ద్వారా రైతులకు పంపిణీ చేశారు. గతేడాది నుంచి ఈ కాన్సెప్టును పక్కనపడేశారు. కంపెనీల నుంచి టెండర్ల ద్వారా సేకరిస్తున్నారు. ఇక్కడ రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. ఒక వైపు పంటకు ధర రావట్లేదు. ఇంకో వైపు విత్తనా ల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి.











