- ఎఫ్‌డిలపైనా సవరింపు
- ఎస్‌బిఐ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. అదే విధంగా పిక్స్‌డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను సవరించుతూ నిర్ణయం తీసుకుంది. గతవారం ఆర్‌బిఐ రెపోరేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్‌బిఐ జారీ చేసిన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు (0.10%) పెంచింది. ఈ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఎస్‌బిఐ బుధవారం వెల్లడించింది. దీంతో మూడు నెలల గడువు గల రుణాలపై ఎంసిఎల్‌ఆర్ 8 నుంచి 8.10 శాతానికి పెరిగింది. ఆరు నెలలు, ఏడాది గడువు గల రుణాలపై ఎంసిఎల్‌ఆర్ 8.40, నుంచి 8.50 శాతానికి చేర్చింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈ రేట్లు అమల్లో ఉంటాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా ఆయా వ్యక్తులకు బ్యాంక్‌లు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. సిబిల్ స్కోర్ 800 పాయింట్లు అంతకంటే ఎక్కువగా ఉంటే గృహ రుణాలపై కనీస వడ్డీరేటు 9.15 శాతం అమలు అవుతుంది. రిస్కు పెరిగినా కొద్ది వడ్డీ రేట్లు పెరుగుతాయి. సిబిల్ స్కోర్ 750 -799 మధ్య ఉంటే వడ్డీరేటు 9.25 శాతం, సిబిల్ స్కోర్ 700-749 మధ్య ఉంటే వడ్డీరేటు 9.35 శాతం, 650-699 మధ్య ఉంటే వడ్డీరేట్లు 9.45 శాతంగా నిర్ణయిస్తుంది. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లలో వడ్డీ రేట్లలో తగ్గుదల ఉంటుంది.
ఫిక్సుడ్ డిపాజిట్ల(ఎఫ్‌డి)ను ఆకర్షించడానికి కూడా ఎస్‌బిఐ వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంకు 400 రోజుల నిర్దిష్ట కాలవ్యవధి ఎఫ్‌డి పథకంపై గరిష్టంగా 7.10 శాతం వడ్డీ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం 2023 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి గల ఎఫ్‌డిలపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని అందిస్తోన్నట్లు ఎస్‌బిఐ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించింది.










