Jan 17,2023 09:43

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌ వినియోగదారులపై భారాలు మోపేందుకు కేంద్రప్రభుత్వం కొత్తకొత్త నిబంధనలు తీసుకొస్తుంది. విద్యుత్‌ చట్టసవరణ బిల్లు-2020కు పార్లమెంట్‌ ఆమోదం పొందకపోయినా దొడ్డిదారిలో భారాలు మోపుతోంది. ప్రతి నెల ట్రూఅప్‌ భారం ప్రజలపై మోపేందుకు కొత్త నిబంధనను కేంద్రప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు విద్యుత్‌ నిబంధన చట్టం-2005లోని నిబంధనలు మారుస్తూ కేంద్ర విద్యుత్‌మంత్రిత్వ శాఖ డిసెంబర్‌ 29వ తేదితో విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను తన వెబ్‌సైట్‌లో ఆలస్యంగా పొందుపరిచింది. ఈ నోటిఫికేషన్‌లో ట్రూఅప్‌ భారాన్ని నెలనెల వసూలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ అడ్జస్ట్‌మెంట్‌ సర్‌చార్జ్‌(ఎఫ్‌పిపిఎఎస్‌) పేరుతో దీనిని అమలు చేయాలని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుతున్నట్లే ఇక కరెంట్‌ చార్జీలు నెలకొక్కసారి పెరుగుతుందన్న మాట. ప్రస్తుతం డిస్కంలు మూడు నెలలకోసారి చేసిన ఖర్చు ఆదాయంలో రాకపోతే ట్రూఅప్‌ భారాలు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇఆర్‌సికి ప్రతిపాదిస్తున్నాయి. డిస్కంల ప్రతిపాదనపై ఇఆర్‌సి బహిరంగ విచారణ నిర్వహించి ట్రూఅప్‌ భారం వేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే 2021-22కి చివరి త్రైమాసికానికి సంబంధించిన ట్రూఅప్‌ భారం రూ.1,048కోట్లు ప్రస్తుతం ఎపిఇఆర్‌సి వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు బొగ్గు ధరలు, విద్యుత్‌ కొనుగోలు ధర, ట్రాన్స్‌మిషన్‌ ధరలు పెరిగిన ప్రతిసారి వీటిని వసూలు చేసుకోవచ్చునని తెలిపింది. ఈ ట్రూప్‌ చార్జీలు ప్రజలపై మోపేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలి(ఇఆర్‌సి)ని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. దీంతో ఇక నుంచి ప్రతి నెల వినియోగదారులకు తెలియకుండానే భారాలు పడనున్నాయి.
          అయితే ప్రస్తుతం ప్రతి నెల ట్రూఅప్‌ వసూలు చేసేందుకు అవసరమైన విధానం, తగిన సిబ్బంది లేరని డిస్కంకు చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలు విద్యుత్‌ నిల్వ ఉంచే విధానం(ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలని కూడా కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈ విధానం చాలా ఖర్చుతో కూడుకున్నది. గతంలోనే ఈ విధానంపై రాష్ట్ర ఇంధన శాఖ ఆలోచన చేసింది. ఈ విధానం వల్ల విద్యుత్‌ యూనిట్‌కు సుమారు రూ.20లు ఖర్చు అవుతుందని అంచనా వేయడంతో వెనక్కి తగ్గింది.