May 21,2023 09:50
  • రుణాలతో కలిపి రూ.2,09,767 కోట్లు
  • ఆదాయ లోటు రూ.42,131 కోట్లు
  • ద్రవ్యలోటు రూ.51,543 కోట్లు
  • 2022-23కి తుది లెక్కలు తేల్చిన పిఎజి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, లోటు లెక్కలను ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తేల్చింది. ముందుగా భావించినట్టే భారీగా ఆర్థిక ఇబ్బందులు వెలుగుచూడడం విశేషం. లోటు కూడా భారీగానే నమోదు కావడం గమనార్హం. చివరిగా ఆదాయం, వ్యయం రెండూ ఒకే మొత్తానికి నివేదికలో పొందుపరిచారు.
         ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,09,767 కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో సొంత పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రూ.1,16,202 కోట్లుగా ఉండగా, కేంద్రం నుంచి రూ.36,048 కోట్లు వచ్చినట్లు తేలింది. రూ.51,453 కోట్లను రుణాలుగా సమీకరించుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు. వాస్తవానికి మొత్తం ఆదాయం రూ.2,79,279 కోట్లు వస్తుందని అంచనా వేయగా, కేవలం రూ.2,09,767 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అంటే రూ.7 వేల కోట్లు తగ్గింది. సొంత పన్నుల ఆదాయం మాత్రం అంచనా కన్నా రూ.14 వేల కోట్ల వరకు అధికంగా రావడం విశేషం. కేంద్ర నిధులు రూ.46,800 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేయగా, కేవలం రూ.36,048 కోట్లు మాత్రమే వచ్చింది. వ్యయానికి సంబంధించి మొత్తం రూ.2,09,767 కోట్లలో రెవెన్యూ వ్యయమే ఏకంగా రూ.2,00,413 కోట్లుగా తేలడం గమనార్హం. పెట్టుబడి వ్యయం అతి కేవలం రూ.7,581 కోట్లుగా రికార్డయింది. లోటును పరిశీలిస్తే ఆదాయ లోటును రూ.42,131 కోట్లుగా చూపించారు. ఇది మొత్తం ఆదాయంలో భాగం కాగా, సొంత ఆదాయంతో పొల్చి చూస్తే లోటు రూ.90 వేల కోట్లు దాటినట్లు తేలింది. ఆదాయ లోటును బడ్జెట్‌ అంచనాల్లో రూ.22,316 కోట్లుగా మాత్రమే చూపించారు. ద్రవ్యలోటు కూడా రూ.51,453 కోట్లుగా నమోదైంది. బడ్జెట్‌లో రూ.54,587 కోట్లుగా చూపించగా, చివరకు స్వల్పంగా తగ్గడం గమనార్హం. మొత్తం రుణాలను బడ్జెట్‌లో రూ.63 వేల కోట్లుగా ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం చివరకు రూ.51,453 కోట్లుగా చూపించడం విశేషం. ఇందులో ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలను (ప్రభుత్వ రంగ సంస్థలు గ్యారంటీల ద్వారా తీసుకునేవవి) చూపించలేదని తెలుస్తోంది.