ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరులోని 10వ డివిజన్ బిఆర్ స్టేడియం వద్ద 1.24 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా మంగళవారం ప్రారంభించారు. గుంటూరు నగర పాలక సంస్థమేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు,ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గౌరవ సీఎం వై.యస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ఆయా రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్య,వైద్య రంగాలను బలోపేతం చేస్తూ పేద ప్రజలకు సత్వర సేవలందే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 560 అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసినట్లు తెలిపారు. గుంటూరులో 16 యు.హెచ్.సిలను మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ల వలన పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ లేకుండా అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైసిపి ముఖ్య నాయకులు, స్థానిక పెద్దలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










