Feb 06,2023 21:12
  •  రూ.350 కోట్ల పెట్టుబడి
  •  750 ఉద్యోగాల కల్పన

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో : ప్రముఖ ఎసి ఉత్పత్తుల కంపెనీ బ్లూ స్టార్‌ తన నూతన ప్లాంటును శ్రీసిటీలో ప్రారంభించింది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ త్యాగరాజన్‌ మాట్లాడుతూ.. ఏడాదికి 3 లక్షల రూమ్‌ ఎసి యూనిట్ల తయారీ సామర్థ్యంతో జనవరిలో లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపారు. రూ.350 కోట్ల పెట్టుబడితో తొలి దశ కార్యకలాపాలు మొదలయ్యాయని అన్నారు. ప్రస్తుతం 750 ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ కొత్త ప్లాంటుతో రూమ్‌ ఎసి తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లకు చేరిందన్నారు. మరో రూ.200 కోట్లతో శ్రీసిటీలోని ప్లాంటును విస్తరిస్తామన్నారు. ఇందుకోసం శ్రీసిటీలో మరో 40 ఎకరాలు స్థలం కొనుగోలు చేశామన్నారు.
మూడో దశ పెట్టుబడులు, విస్తరణతో మొత్తం 2,000 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2027 నాటికి 12 లక్షల యూనిట్ల సామర్థ్యానికి చేర్చనున్నామన్నారు. ప్రస్తుతం తమకు దేశంలో 7 ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఎగుమతుల ద్వారా 110 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ వస్తుందన్నారు. మూడేళ్లలో 250 మిలియన్‌ డాలర్ల ఎగుమతులను చేరాలని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. భారత ఎసి మార్కెట్‌లో బ్లూ స్టార్‌కు 13.5 శాతం మార్కెట్‌ వాటా ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 కల్లా 15 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దేశంలో 80 లక్షల ఎసి అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. చైనా 2006లోనే ఈ మార్క్‌ను చేరిందన్నారు. ఎసి రంగంలో భారత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. గతేడాది రూ.6000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని, ఈ ఏడాది రూ.8000 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామని అన్నారు. తమ పోర్టుఫోలియోలో 75 రకాల ఎసిలు ఉన్నాయన్నారు. తమ ఎసిలు రూ.29,900 నుంచి ప్రారంభమవుతాయన్నారు.