Apr 24,2023 08:23

ఇప్పుడు దైవదత్తమే రాజ్యమిక్కడ..!
మనువు, తనువుల ముందు
జన్యువు పెద్ద పాప పరిహారం
సృష్టికర్తకు, డార్విన్‌కి మధ్య పోలికెక్కడీ
నక్కా, నాకలోకం ఒక్కటా..! మరి..!
జనం బుర్రను తొలిస్తేనో,
నెత్తిన కాలేసి పాతాళానికి తొక్కితేనో
గుండెలు చీలిస్తేనో కదా!
అవతార్లుగా నిలిచిపోయేది
కణం కేంద్రకంతో కలిసి కాటికాపరిలా
తిరిగినవాడు..
నేటికీ మనిషి గురించే ఒంటరిగా మిగిలిపోయాడు..!
శాస్త్రీయంగా పాఠ్యాంశం నుంచి తొలగిపోయాడు
వానరుడే నరుడయ్యాడని ఒప్పించడం
అంత తేలికేమీ కాదు..!
ఆదిలో పంచభూతాల్ని
పరబ్రహ్మ స్వరూపాలుగా ఒప్పుకు తీరాలి
హోమంలో కాలిపోయి, యాగంలో మునిగిపోవాలి
గాలిలో బూడిదిలా ఎగిరిపోవాలి!
అప్పుడే జీవపరిణామాన్నే కాదు
సజీవ స్వప్నాల్ని సైతం శాస్త్రోక్తంగా
దహనం చేసే కిష్కింధకాండ
సుసాధ్యమయ్యేది...!
హేతువును నిట్టనిలువునా నిలదీసి
ఉరితీసిన జీవులకు..
అబద్ధాన్ని జ్ఞానసముపార్జనగా ఆచరించడం
ప్రాణసుఖం కదా..!
కోతిలోను, రాతిలోను దాగిన
సారస్వతానికి సాష్టాంగం చేయడం
అరాచక నీతికి ఎంత బలం..!
శిరచ్ఛేదనాల చరితకు పచ్చతోరణం కదా..!
ఇక కిరణం దైవరూపం
జన్య సంయోగం ఇక క్రియ కాదు
అది కర్మకాండ
సకల ప్రాణకోటిలో పరమాత్మను దర్శించి
మనిషికి మాత్రమే ..
వర్ణాలను అద్ది నిర్జీవంగా నిలబెట్టే
దీపదూప నైవేద్య ప్రక్రియ
నమ్మండి..! లేదా చావండి..!!
 

- డా. జికెడి ప్రసాద్‌
93931 11740