స్వాతంత్రోద్యమ చరిత్రలో చాలామంది నాయకులు కుల, మత, ప్రాంత భేదం లేకుండా దేశం కోసం పోరాటంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వాళ్లకు ఎదురొడ్డి నిలబడ్డారు. వీరిలో ఎంతోమంది ముస్లిములు నెత్తురు ధారబోశారు. వారి చరిత్రను రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రజలకు తెలియజేశారు. 'ముస్లిములు లేకుండా భారతదేశ చరిత్ర నిర్మించలేము. ముస్లిముల శ్రమ లేకుండా భారత ఉత్పతుల్లేవు. ముస్లిముల సంస్కృతి లేకుండా భారతదేశ సంస్కృతి, నాగరికత పరిపూర్ణం కాదు' ఈ మూడు అంశాలను నశీర్ తన గ్రంథాల్లో ప్రవహింపచేశారు. ఇదంతా ఆయనలోని హేతుబద్ద ఆలోచనా విధానం వల్లే సాధ్యమైంది.
నశీర్ నెల్లూరు జిల్లా పురిణిలో 1954, ఆగస్టు 1న జన్మించారు. తండ్రి సయ్యద్ మీరా మొహియుద్దీన్, తల్లి బీబీజాన్. కావలిలో విశ్వోదయ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. తరువాత కుటుంబం గుంటూరు జిల్లా నరసరావుపేటకు వెళ్లింది. నశీర్ వృత్తిరీత్యా న్యాయవాది. ఎక్కువ రోజులు ఈ వృత్తిలో లేరు. జర్నలిస్టుగా ఉదయం, వార్తా పత్రికల్లో పనిచేశారు. ఆ సమయంలో స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. తన పరిశోధనా వృత్తికి అడ్డు కాకూడదని ఉద్యోగం మానేశారు. గ్రంథాలయాలు, ఊళ్లు తిరిగి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు.
చరిత్ర గుర్తించని వారి గురించి
భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిముల పాత్రను వివరిస్తూ 22 గ్రంథాలను వెలువరించారు. నశీర్ రాసిన ప్రతి గ్రంథంలోనూ బహుముఖీన నైపుణ్యం సుస్పష్టమవుతుంది. ఒక ఉద్యమాన్ని, చరిత్రను సమన్వయించి రాయడంలో ఆయన రచనల్లో సమకాలీన సామాజిక దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో మతదురహంకారానికి దూరంగా ఉన్న సిరాజుల్ హసన్ తిర్మిజ్, డాక్టర్ అక్బర్ అలీ, జలాలుద్దీన్, హసన్ ముహమ్మద్ పహిల్వాన్, విరీర్ అహమ్మద్ అలీఖాన్, డాక్టర్ లతీఫ్ సయూద్ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. విలీనం కోరుతూ ఉద్యమించారు. సామ్యవాద సిద్థాంతాలకు ఆకర్షితులై సమసమాజ స్థాపన లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలో భాగస్వాములైన మగ్దూం మొహిద్దీన్, అలం ఖుంద్ విరీర్, హసన్ నాసిర్, జవ్వాద్ రజ్వి, ఆఖ్తర్ హుస్సేన్, జహందర్ అస్ఫర్, కుతుబ్ యే ఆలం, హసన్ అలీ విరీరాజ్, విరీరాజ్ హైదర్ హుస్సేన్, హుస్సేని షాహిద్ లాంటి వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన ప్రముఖులు నైజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలని డిమాండ్ చేశారు. వీరంతా చరిత్రలో నిర్లక్ష్యం చేయబడినవారు. వారి వివరాలను నశీర్ వెలికితీసి గ్రంథాలుగా రచించారు. సమాచార సేకరణలో కొన్ని నెలల తరబడి హైదరాబాద్‌లోని గ్రంథాలయాల్లో గడిపారు.
అవమానాలెదురైనా ...
చరిత్రకారులు, స్వాతంత్ర సమరయోధులు, పెద్దలను కలిసే క్రమంలో ఆయన దేశంలో తిరగని ప్రాంతమంటూ లేదు. గ్రంథాల్లో ఉన్న చిరునామా ఆధారంగా ఆయా ఊళ్లకు వెళ్లారు. వారి కుటుంబసభ్యుల గురించి ఆరా తీశారు. స్వాతంత్రం కోసం ప్రాణాలొదిలిన నాయకులు, వారి స్నేహితుల కోసం వెతుకులాట సాగించారు. ఏ ఒక్క సమాచారం దొరికినా వదిలిపెట్టకుండా ఆయన గ్రంథంలో ఇమిడ్చారు.
పరిశోధనా క్రమంలో ఆయనకు ఎన్నో అవమానాలు, మరచిపోలేని సంఘటనలు ఎదురయ్యాయి. అయినా పట్టువదలకుండా ప్రయాణం సాగించారు. ఒకసారి విశాఖపట్నంలో విశాఖ గాంధీ గురించి తెలుసుకునేందుకు వారి బంధువుల ఇంటికి వెళ్లారు. ఆయన ఆస్తి మొత్తం గ్రంథాలయానికి రాసిచ్చారనే కోపంతో వివరాలు చెప్పలేదు. ముఖం మీదే తలుపులేశారు. అయినా మళ్లీ వెళ్లారు. పదే పదే వెళుతూనే ఉన్నారు. చివరికి ఆ ఇంట్లో ఓ విద్యార్థి నశీర్ సంకల్పాన్ని గుర్తించి సమాచారాన్ని అందించారు.
విజయవాడలో పోరాట యోధుడు మొహమ్మద్ గులాం మొహియుద్దీన్ గురించి తెలుసుకునేందుకు నశీర్ చాలా కష్టపడ్డారు. సీనియర్ అడ్వకేట్ అయిన ఆయన వారసుడు హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకొని ఒక పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపారు. ఆయన తిరిగి ఆ పుస్తకానికి డబ్బులు పంపారు గాని సమాచారం ఇవ్వలేదు. అయినా నశీర్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. సమాచారం కావాలని కోరుతూనే ఉన్నారు. ఫోన్లు చేసినా స్పందన లేదు. శ్మశానంలో ఓ రాయి మీద మహద్దీన్ సమాచారం ఉంటుందని తెలిసిన వాళ్లు చెప్పడంతో నశీర్ విజయవాడ పరిసర ప్రాంతంలో శ్మశానం దగ్గరకు వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లేసరికి దర్గా ఉంది. అక్కడ రాళ్లన్నింటిని తొలగించి దర్గా కట్టినట్లు చెప్పారు. ఇటువంటి ఆశాభంగాలు నశీర్ జీవితంలో చాలానే ఉన్నాయి. అయినా సమాచార పరిశోధన ఎప్పుడూ ఆపలేదు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రైఫిల్‌మెన్‌గా పనిచేసిన షేక్ ఖాదర్ మహుద్దీన్ గురించి తెలుసుకునే క్రమంలో ఆయన అడ్రస్ దొరికింది. దాంతో నశీర్ విజయనగరం జిల్లా వేంపాడు గ్రామానికి 'షేక్ ఖాదర్ గురించి తెలిస్తే వివరాలు ఇవ్వగలరు' అని ఉత్తరం రాశారు. మూడు రోజుల తర్వాత నశీర్‌కు ఫోనొచ్చింది. తాను ఖాదర్ కుమారుడినని, ఖాదర్ బతికే ఉన్నారని, కలిసి మాట్లాడమని చెప్పారు. దాంతో నశీర్ ఆనందానికి అవధుల్లేవు. మరుసటి రోజే వెళ్లి పెద్దయాన్ను కలిశారు. ఇలాంటి ఆనందభాష్పాలు వచ్చిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.
ప్రజలకు చేరువయ్యేలా
ఆయన గ్రంథాల్లోని సమాచారాన్ని ప్రజలకు తెలియపరచడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది సభలు, సమావేశాల్లో ప్రసంగాలు చేశారు. సమరయోధుల చిత్రాల ప్రదర్శనలు నిర్వహించారు. పుస్తకాలకు అంటించే స్టిక్కర్లు, క్యాలెండర్లు ముద్రించి పంపిణీ చేశారు. వేల సంఖ్యలో చిన్నచిన్న పుస్తకాలు ప్రచురించారు. విజిటింగ్ కార్డు సైజ్‌లో బోర్డు ముక్కల మీద స్వాతంత్య్ర సమరయోధుల సమాచారం ముద్రించి 50,000 కార్డులు పంపిణీ చేశారు. పతంగుల మీద సమరయోధుల చిత్రాలు ముద్రించారు. విద్యార్థులకు సమరయోధుల చరిత్ర పుస్తకాలు, సామగ్రి అందజేసి ఆయా అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పుస్తకాల పిడిఎఫ్ ఫైళ్లను సోషల్‌మీడియా ద్వారా 30 వేల మందికి పోస్టు చేశారు. ఇదంతా తన ఒక్కరి వల్ల అయ్యే పని కాదని, భార్య రమిజా భాను, తల్లి బీబీజాన్, మామయ్య పీర్ అహమ్మద్ ప్రోత్సాహంతోనే సాధ్యమైందటారు నశీర్.

పుస్తకాలు - అవార్డులు
భారత స్వాతంత్రోద్యమం : ముస్లిములు, భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం మహిళలు, భారత స్వాతంత్రోద్యమం : ఆంధ్రప్రదేశ్ ముస్లిములు, మైసూరు పులి : టిప్పు సుల్తాన్, భారత స్వాతంత్రోద్యమం : ముస్లిం ప్రజా పోరాటాలు, గాంధీజీ ప్రాణ రక్షకుడు : బతక్ మియా అన్సారీ, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం : హిందూ - ముస్లిముల ఐక్యత వంటి పలు గ్రంథాలు రశారు. ఈయన గ్రంథాలన్నీ తెలుగు, ఆంగ్లం, తమిళం, కన్నడం, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం మలయాళం, గుజరాతీ భాషల్లోనూ అనువాదం అవుతున్నాయి.
నశీర్ అహమ్మద్ సాగిస్తున్న అవిరళ కషికి గుర్తింపుగా వి.ఆర్ నార్ల విశిష్ట జర్నలిస్టు అవార్డు, తెలుగు భాషా పురస్కారం, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఫెలోషిప్ అవార్డు, అఫ్ఫాఖుల్లా ఖాన్ స్మారక అవార్డు, మాస్టార్‌జీ ఫౌండేషన్ సేవారత్న పురస్కారం వంటి ఎన్నో సేవా పురస్కారాలు అందుకున్నారు.
- పద్మావతి










