దగ్ధమవుతున్న చీకటి చివరల్లో
వేదనాభరిత శిథిలాగ్రస్త దేహంలో...
విడిపోతున్న మనుషుల మనసులకు
మాసికలతోనైనా అతుకులు పెట్టే
విఫలయత్నం కొనసాగుతూనే వుంది
రంగులీనుతున్న రాగద్వేషాల సుడిగుండంలో
దిక్కులకు జరిగిపోతున్న
మనుషులను ఒడిసి పట్టుకోలేక
కలిపికుట్టే అక్షరాల్ని వడక లేక
నిరంతరం నాలుగురోడ్ల కూడలిలోనే
నలుగురు కూర్చుని నవ్వాల్సినవేళ
దుఃఖమొక్కటే టీ కప్పును నింపుతోంది
ఆకాశం నుంచి జారుతోన్న చివరి చినుకు
పొడిబారిపోయి ముక్కలవుతూనే
రాలిన జాగాలో తేమకోసం వెతుకులాట
పగుళ్లుబారిన కాగితాల మీద
ఇంకిపోయిన మాటల్లో
పచ్చదనాన్ని పులిమే మిషలో...
గిడసబారిన కలం
చేతుల్లో నిలవడంలేదు
అల్మారాల్లో పోసిన కాగితాల గదుల్లో
ఎక్కడనుండో ప్రసరిస్తోన్న
దుమ్ముకిరణాల వెలుగులో
కాఫీ టేబుల్ పై ఏదో విషాదం ఒలుకుతోంది.
హౌరున ఎగసిపడుతోన్న
సముద్రానికి ఎదురుగా
పరుగులు తీస్తోన్న నత్తగుల్లల్లోంచి
తల బయటకు పెట్టి
శత్రువు ఉనికిని పసిగట్టే ప్రయత్నంలో...
దాగుడుమూతలాట లోంచే
ఆట మాటున వాడు
శాశ్వతంగా కనుమరుగవుతాడు
హాజరు పరిచిన వాళ్ళల్లో
వాడి ఆనవాళ్లు ఎక్కడా కనబడవు
ముఖానికి ఏవేవో లేబిళ్లు అతికించుకొని
ఎవరెవరో కొన్ని నినాదాలు చేస్తుంటారు
దు:ఖతీరాల్లో
హఠాత్తుగా లేచిన ఓ శిలావిగ్రహం
తూర్పు దిక్కుగా వేలుపెట్టి చూపిస్తూ వుంటుంది
- బండ్ల మాధవరావు










