Sep 14,2023 07:09

ఒక అవసరం ఎన్నో కొత్త ఆవిష్కరణలకు బీజం వేస్తుంది అనడానికి మన కళ్ల ముందు ఎన్నో ఉదాహరణలున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకుని నయా ఆవిష్కరణలను రూపొందిస్తారు చాలామంది విద్యావంతులు. కానీ, ఆర్థిక కష్టాలతో అర్థంతరంగా చదువు ఆపేసిన వడ్రంగి, సిమెంటు పని కార్మికుడు, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, విత్తనాలు చల్లడం, కోత, కలుపు తీయడం వంటివి చేసే వ్యవసాయ కార్మికులు కూడా కొత్త కొత్త ప్రయోగాలతో ప్రజలకు ఉపయోగపడే నయా ఆవిష్కరణలతో ముందుకు వస్తారంటే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ వారిలో సృజనను వెలికితీసి జీవితంలో వారు ఊహించని ఎత్తులకు ఎదిగేలా చేస్తున్నారు సికింద్రాబాద్‌కి చెందిన విశ్రాంత ఆర్మీ అధికారి పి.గణేషమ్‌. 18 ఏళ్లుగా నిర్విరామంగా ఆయన చేసిన కృషికి 200కి పైగా కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 13కి రాష్ట్రపతి అవార్డులు, రెండింటికి పద్మశ్రీ అవార్డులు కూడా సొంతమయ్యాయి. 'పల్లె సృజన' పేరుతో గణేషమ్‌ చేస్తున్న ఈ కృషి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు.

1


తెలంగాణ భూంపల్లికి చెందిన గణేశమ్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. ఆర్మీలో 35 ఏళ్లు విధులు నిర్వర్తించారు. నూతన ఆవిష్కరణలపై ఆసక్తి ఎక్కువ. సైన్యంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆవిష్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పేవారు. '2005లో 'నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఐఎఫ్‌) అనే హనీబీ నెట్‌వర్క్‌, ఢిల్లీలో గ్రామీణ ఆవిష్కర్తలు, ఆర్మీ జవాన్లతో అట్టడుగు స్థాయి ఆవిష్కరణలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడు అక్కడ తెలుగు వారు ఎవరూ కనిపించలేదు. వాలంటీర్లు లేకపోవడం వల్లే ఆ నెట్‌వర్క్‌ మన రాష్ట్రానికి చేరలేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను. దేశానికి తెలుగువారి గ్రామీణ విజ్ఞానాన్ని పరిచయం చేయాల'ని అంటూ తన ప్రయాణ తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. 2006లో రిటైర్ట్‌ అయిన గణేషమ్‌ రాష్ట్రపతి చేతుల మీదుగా 'విశిష్ట సేవా మెడల్‌' అవార్డును కూడా అందుకున్నారు.
విశ్రాంత జీవితంలో నూతన ఆవిష్కర్తలకు అండగా నిలిచేందుకు సిద్ధమైన గణేషమ్‌ 'అందుబాటులో ఉన్న ముడి పదార్థాలతో యంత్రాలు తయారుచేసుకుని చాలామంది తమ పనిని సులువుగా చేయడం నేను గమనించాను. అయితే అవి విక్రయించదగిన స్థితిలో ఉండేవి కావు. సాధారణంగా ఆ ఆవిష్కర్తలు వాటిని విక్రయించేందుకు తయారుచేయరు. కానీ వాటి అవసరం చాలా ఉంది. అది ఇతరులకూ ఉపయోగపడితేనే ఆ ఆవిష్కరణ సజీవంగా ఉంటుంది. అందుకే నేను ఈ ప్రయాణం ప్రారంభించాను. నా దృష్టిలో ఈ ప్రయాణం మరుగున పడివున్న జ్ఞాన దేవాలయాలను సందర్శించడంలా భావిస్తాను' అని అంటున్నప్పుడు ఆయన మాటల్లో ఎంతో సంతృప్తి కనిపిస్తోంది.

1

ఆవిష్కర్తల్లో కొందరు మల్లేశమ్‌

సిరిసిల్లకు చెందిన సిహెచ్‌ మల్లేశమ్‌ స్కూలు డ్రాపౌట్‌. పేద నేత కార్మికుడు. అతనికి 'పల్లె సృజన' ఇచ్చిన ప్రోత్సాహంతో 'లక్ష్మీ ఆసు' యంత్రం ఆవిర్భవించింది. ఏకకాలంలో ఆరు చీరలను ఒక్క రోజులో నేయడం ఆ యంత్రం ప్రత్యేకత. చిన్న పరిమాణంలో ఉండే 0.25 హెచ్‌డి మోటారు అమర్చి మల్లేశం సాధించిన ఈ ఘనత అతణ్ణి 'ఫోర్బ్స్‌' పత్రికలో చోటు సంపాదించేలా చేసింది. భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. మల్లేశమ్‌ జీవితం ఆధారంగా ప్రియదర్శి, అనన్య జంటగా 'మల్లేశమ్‌' అనే చిత్రం కూడా కొన్నాళ్ల కిందట విడుదలై విశేషంగా ఆకర్షించింది.
తన తల్లి పడే కష్టం చూసి పనిలో వెసులుబాటు కోసం మల్లేశమ్‌ ఓ యంత్రం తయారుచేయడం కోసం సిద్ధమయ్యాడు. అతనికి కావాల్సిన సామగ్రిని 'పల్లె సృజన' అందించింది. ఆ తోడ్పాటు అతన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. ''లక్ష్మీ ఆసు యంత్రం' ఎంతోమంది నేత కార్మికులకు గొప్ప వరమని, నూతన యంత్రాల ఆవిష్కరణల్లో మల్లేశమ్‌ విప్లవాన్ని సృష్టించాడ'ని ఫోర్బ్స్‌ అతన్ని కొనియాడింది.
పాండురంగారావు.. సైకిళ్లు, స్కూటర్లకు పంచర్లు వేసుకుంటూ జీవనం సాగించేవాడు. పదో తరగతితో చదువు ఆపేశాడు. సహజ గాలి సీలెంట్‌తో ట్యూబ్‌లకు హాని కలిగించకుండా మోటారు సైకిళ్లు, ఆటో టైర్లకు పంచర్లు వేసే యంత్రాన్ని తయారు చేశాడు. పంచర్ల షాపులో ఉన్న వస్తువులతోనే దీన్ని సిద్ధం చేసుకున్నాడు. వృధాగా పారేసే వస్తువులతో తయారుచేసిన ఈ పరికరానికి 'ఎయిర్‌సీల్‌ ట్యూబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' పేరుతో గణేషమ్‌ జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. స్వల్ప కాలంలోనే ఆ యంత్రం విశేష ప్రజాదరణ పొందింది. రంగారావును ప్రత్యేక ఆవిష్కర్తగా నిలబెట్టింది. 2017లో రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక చేసింది. ద్రవరూపంలో ఉండే ఈ ట్యూబ్‌ సీలింగ్‌ పదార్థాన్ని స్థానిక మార్కెట్లతో పాటు మహారాష్ట్ర, కర్నాటకలో కూడా విక్రయిస్తున్నారు.

2

'పల్లె సృజన' ఏం చేస్తుందంటే..

'శోధా యాత్ర' పేరుతో 20 నుంచి 40 మంది 'పల్లె సృజన' వాలంటీర్లు గ్రామగ్రామాలకు తిరుగుతారు. రెండు, మూడు రోజులు అక్కడే గడుపుతారు. వ్యవసాయం, ఇతర పనులు చేసుకుంటున్న కార్మికులతో మాట్లాడతారు. యాత్రలో భాగంగా నూతన యంత్రాలతో పనులు చేసుకుంటున్న వారితో ప్రదర్శనలు చేయించడం, పేటెంట్‌ హక్కులు కల్పించడం, డాక్యుమెంట్‌ రూపంలో వారి పరిజ్ఞానాన్ని ప్రచారం చేయడం వంటివాటిపై అవగాహన కల్పిస్తారు. అలా ఇప్పటికి 50కి పైగా ఆవిష్కరణలకు మార్కెటింగ్‌ చేశారు. గణేషమ్‌, ఆయన బృందం దేశ నలుమూలల్లో వారం వారం ప్రదర్శనలు నిర్వహిస్తారు. 'పల్లె సృజన' పేరుతో నడుపుతున్న పత్రికలో ఆవిష్కర్తల విజయగాథలు ప్రచురిస్తారు. 'ఈ ప్రచురణలు కొత్త అధ్యాయానికి తెరదీస్తున్నాయి. ఎంతోమంది ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తున్నాయి' అంటున్నారు గణేషమ్‌.

ఇంకా ఏం చేస్తారంటే..

'పల్లె సృజన' ద్వారా ఎంతోమంది ఆవిష్కర్తలను కలిసిన వాలంటీర్ల బృందం వారు తయారుచేసిన యంత్రాలను మూడు విభాగాలుగా విభజిస్తుంది. 1. అమ్మకానికి సిద్ధంగా ఉంది (ఆర్‌ఎఫ్‌ఎస్‌), 2. వ్యాపారవేత్త కోసం సిద్ధంగా ఉంది (ఆర్‌ఎఫ్‌ఇ), 3. నమూనా కోసం సిద్ధంగా ఉంది (ఆర్‌ఎఫ్‌పి).
ఇలా విభజించిన యంత్రాలతో ఇప్పటివరకు 2,500 సాంప్రదాయ పద్ధతులను డాక్యుమెంట్‌ చేశారు. 'ఆవిష్కర్తలందరూ సమిష్టిగా ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైగా టర్నోవర్‌ను సృష్టించారు. ఈ ప్రభావం 5 లక్షల పైచిలుకు కుటుంబాలపై ఉంద'ని తన లక్ష్యం గురించి గణేషమ్‌.గర్వంగా చెబుతున్నారు.
పల్లె విజ్ఞానాన్ని వెలికితీయడంలో ఈ విశ్రాంత జవాను అవలంబిస్తున్న విధానం ఎంతోమందికి మార్గనిర్దేశకంగా ఉంది. ఈ విధంగా మరిన్ని ఆవిష్కరణలు రావాలని ఆశిద్దాం.