ఢిల్లీ: హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ .. 2024లో రెండు బిలియన్ డాలర్ల విలువ చేసే విదేశీ కరెన్సీ బాండ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన రోడ్‌షోల్లో ఇన్వెస్టర్లకు తెలియజేసింది. వీటికి నిధులు ఎలా సమకూర్చుకోనుందో వారికి వివరించింది. ఈ పరిణామం తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పుంజుకున్న విషయం తెలిసిందే.
ఇలా రానున్న రోజుల్లో చేయాల్సిన చెల్లింపులను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ నోట్ల జారీ, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లించనున్నట్లు ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ అధికారులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఆర్థిక పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. సింగపూర్, హాంకాంగ్‌లో గ్రూప్ ప్రత్యేక రోడ్‌షోలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీటిని మార్చి 7 నుంచి 15 మధ్య దుబారు, లండన్, అమెరికాకు కూడా విస్తరించనున్నారు.
రోడ్‌షోలో తెలిపిన వివరాల ప్రకారం 2019లో రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్న అదానీ గ్రూప్ స్థూల రుణాలు 2023 నాటికి రూ.2.21 లక్షల కోట్లకు చేరాయి. విదేశీ కరెన్సీలో ఉన్న ఎలాంటి బాండ్లకు 2025లో చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. 2026లో మరో 1 బిలియన్ డాలర్ల బాండ్లకు చెల్లించాల్సి ఉంది.
2015- 2022 మధ్య అదానీ గ్రూప్ కంపెనీలు విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా 10 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నాయి. వీటిలో 1.15 బిలియన్ డాలర్లు విలువ చేసే బాండ్లకు 2020, 2022లో గడువు ముగిసింది. 2023లో మాత్రం ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కానీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తీసుకున్న 650 మిలియన్ డాలర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ తీసుకున్న 750 మిలియన్ డాలర్లు, 500 మిలియన్ డాలర్ల బాండ్లకు 2024లో చెల్లింపులు చేయాల్సి ఉంది.










