
మారుతున్న జీవన శైలి కారణంగా చాలామందిలో కీళ్ల నొప్పుల సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తీవ్ర కీళ్ళనొప్పులు, వాపుల సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా డాక్టరు సలహాలతో ఆహార, ఆరోగ్య సలహాలు పాటిస్తే సులభంగా నయం చేసుకోవచ్చు. కీళ్ళ నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి. వాతము నొప్పులు, కీళ్లు అరుగుదల నొప్పులు..పోషకాహారం లోపించడంతో వచ్చే నొప్పులు..ఒత్తిడితో వచ్చే నొప్పులు. వీటిలో కీళ్ల వాతంతో కలిగే నొప్పులను తొలి దశలో గుర్తించడం ఎంతో అవసరం. కీళ్లవాతం రావడానికి గల కారణాలు ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. సాధారణంగా మన శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంగా ఉంచే కణాలు (తెల్లరక్తకణాలు) బ్యాక్టీరియా, వైరస్‌ల నుండి మనకు రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడితే మన తెల్ల రక్త కణాలు మన శరీరాన్నే దాడి చేయడం ప్రారంభిస్తాయి. దీని వలన మన శరీరంలో మార్పులను వాతం లక్షణాలు అంటారు. కీళ్ల దగ్గర నొప్పులు, వాపులు రావడం, కీళ్లపై ఉన్న చర్మం ఎర్రగా కందడం, కీళ్ల నొప్పులు రాత్రి వేళ అధికంగా ఉడటం, ఉదయం సమయంలో కీలు బిగుతుగా ఉండి నొప్పి అధికంగా ఉండటం కీళ్ల వాతం లక్షణాలు.వీరికి చల్లటి వాతావరణంలో నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. కీళ్లవాతం నియంత్రించకపోతే అనేక దుష్ఫ్రభావాలు వస్తాయి. జ్వరం, విపరీతమైన నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం, చర్మంపై లోతైన పుండ్లు పడటం, నరాలు చచ్చు బడటం, కంటి చూపు తగ్గడం, ఊపిరితిత్తులు పాడవడం, వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కీళ్ల వాతం నియంత్రించకపోతే చివరి దశలో దీని ప్రభావంతో బిపి, షుగర్ మాదిరిగా గుండె, మెదడుకు సంబంధించిన రక్త నాళాలపై దీని దుష్ప్రభావాలు పడతాయి. కీళ్లవాతానికి చాలా మంది దీర్ఘకాలంగా ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్స్, నొప్పి బిళ్లలు వాడుతూ దుష్ప్రభావానికి లోనవతున్నారు. కాని కీళ్లవాతం నియంత్రణకు ' డిఎంఎఆర్‌డి ' ( డిజీస్ మాడిఫైయింగ్ యాంటి రుమాటిక్ డ్రగ్స్ ) అనే మందులు రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో తీసుకోవడం తప్పనిసరి.
- డాక్టర్ ముండ్రా నరసింహారావు,
సీనియర్ వైద్య నిపుణులు