Aug 22,2023 09:11

వ్యాధి కారక క్రిములు విశృంఖలంగా సంచరించే కాలం వర్షాకాలం. చల్లటి వాతావరణం, పైగా వర్షాలు సూక్ష్మక్రిముల సంచారానికి అనువైనవి. కాబట్టే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడుతూ ఉంటార. అయితే రోగ నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుకోగలిగితే వర్షాకాల రుగ్మతల నుంచి తేలికగానే తప్పించుకోవచ్చు. శారీరక, మానసిక శక్తులను కూడా పెంచుకోవాల్సివుంటుంది. చల్లటి వాతావరణం ప్రభావం మూలంగా వాత, పిత్త, కఫ స్వభావాలు వ్యక్తులను బట్టి విరుద్ధంగా స్పందిస్తూ ఉంటాయి. వ్యక్తుల తత్వాలు, రుతువులను బట్టి మారుతూ ఉంటాయి. కప తత్వ వ్యక్తుల్లో ఈ కాలంలో కపం పేరుకుపోయి ఉంటుంది. ఈ సమస్యను ఆయుర్వేద వైద్యంతో సరిచేయొచ్చు.

554


         ఆహారం. జీవన శైలితోపాటు వ్యాధి నిరోధక శక్తిని ప్రభావితం చేసే అంశాలు అనేకం ఉంటాయి. వంశపారంపర్యం, రుతువు, మనుషుల ఆధారంగా వ్యాధి నిరోధక శక్తిలో మార్పులు వస్తుంటాయి. అయితే సరైన ఆయుర్వేద చికిత్సతో వంశపారంపర్యంగా సంక్రమించిన, రుతువుల పరంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే వయసు రీత్యా పెరిగి, తరిగే వ్యాధి నిరోధక శక్తిని సరిదిద్ది సంవత్సరం మొత్తం సమంగా ఉండేలా చేయొచ్చు. రుతువులను బట్టి జీవన దశలను బట్టి వ్యాధి నిరోధక శకిలో మార్పులు వస్తూ ఉంటాయి. సమగ్రమైన ఆయుర్వేద విధానాలను ఆచరించటం మూలంగా సమతుల్యమైన శాశ్వతమైన వ్యాధి నిరోధక శక్తిని పొందొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంలో ఆయుర్వేద వైద్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది. పని ఒత్తిడి, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌, అధిక బరువు నియంత్రణ, గైనకాలజీ సమస్యలతోపాటుగా మాతృరక్ష, వామనం, విరేచనం, వాస్త, నస్యం, రక్తమోక్షనం, అర్థిరైటిస్‌, స్పాండిలైటిస్‌ వంటివి సులభంగా తగ్గించుకోవచ్చు.
 

                                                           ఆలస్యంగా తగ్గుతాయనేది అపోహ

సాధారణ వైద్య పద్ధతులతో పోలిస్తే ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలు చాలా ఆలస్యంగా తగ్గుతాయనే అపోహ ఉంది. ఇది నిజం కాదు. ఇంగ్లీషు మెడిసిన్‌తోపాటు ఆయుర్వేదం వైద్యంలో కూడా వేగంగా రోగాన్ని నయం చేయొచ్చు. త్వరగా తగ్గవని కొందరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఆయుర్వేదం వైద్యానికి వస్తుంటారు. ఆయుర్వేదం మందులు వాడితే వేడిచేస్తుందనే అపోహ కూడా ఉంది. ఇది నిజం కాదు. అది శరీరతత్వం, రోగ నిరోధక శక్తిని బట్టి ఉంటుంది. అంతే తప్ప వేడి చేస్తాయనేది అపోహ మాత్రమే. పూర్వకాలంలో మన పూర్వీకులు మన ఇంటి పరిసరాలు, వంటింట్లో ఉండే ఔషధాలను వాడే రోగాలను నియంత్రించుకునే వారు. ఇప్పుడు కూడా అలాగే చేయటం ద్వారా నయం చేసుకోవచ్చు. మన ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు, నెయ్యి, మజ్జిగ, నువ్వులు వంటివి తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. నెయ్యిలో ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఉన్నాయి. తాజాగా ఉండే మజ్జిగ తాగటం కూడా ఎంతో మంచిది.
 

                                                         జీవన శైలిలో మార్పులు అవసరం

ప్రతిఒక్కరూ ఒక క్రమబద్ధమైన జీవిత శైలిని అలవర్చుకోవాలి. నియమబద్ధమైన అంటే సమతులమైన పౌష్టికాహారాన్ని తీసుకోవటం మంచిది. తద్వారా రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ పవర్‌) పెరుగుతుంది. కరోనా సమయంలోనూ, ఇతర వేవ్‌ల సమయంలోనూ వైరస్‌ నుండి సంరక్షించడంలో ఇమ్యూనిటీ ముఖ్య పాత్ర పోషించింది. విటమిన్‌ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. రోగనిరోధక శక్తి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. విటమిన్‌ సి మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరం.
 

                                                                       వ్యాయామం అవసరం

ప్రతిఒక్కరూ నిద్ర, వ్యాయామం కోసం సమయం కేటాయించాలి. ఒత్తిడులకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు తినడం కూడా మంచిది. ఏడాది పొడవునా శరీరం చురుగ్గా ఉండాలంటే సూక్ష్మపోషకాలు చాలా అవసరం. అన్ని సూక్ష్మ పోషకాలు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఆహారంలో అవి తగినంతగా లేనప్పుడు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. పాల ఉత్పత్తులు, మాంసాహార ఉత్పత్తులు, తృణధాన్యాలు, మిల్లెట్లను ఆహారంలో చేర్చుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించాలి. సూక్ష్మపోషకాలతో పాటు, ప్రతిరోజూ ఫైబర్‌, నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం సమతుల్య శారీరక శ్రమను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాసేపు వ్యాయామం చేయాలి.

                                           ఇమ్యూనిటీ పెంచే పదార్థాలు

  • పాల ఆధారిత ఉత్పత్తులైన పాలు, జున్ను, పెరుగు, పాల పొడి
  • సోయా పాలు, దాని ఉత్పత్తులు
  • ప్రోబయోటిక్స్‌ సమృద్ధంగా ఉండే తృణధాన్యాలు, పోషకాహార పదార్థాలు
  • విటమిన్‌ ఇ అధికంగా ఉండే ఆహారాలు
  • బాదం, వేరుశెనగ , బాదం వంటి గింజలు
  • పొద్దుతిరుగుడు విత్తనాలు,
  • గోధుమగింజల చమురు, పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్‌ నూనె వంటి కూరగాయల నూనెలు
  • బలపర్చిన (ఫోర్టిఫైడ్‌) ధాన్యపు అల్పాహారాలు
  • జింక్‌ కలిగిన కింది ఆహారాల వంటివి
  • పీతలు, ఎండ్రకాయల వంటి సముద్రాహారం (సీఫుడ్‌)
  • ఎర్ర మాంసం, గుడ్లు, మాంసం
  • చేప నూనె (ఫిష్‌ ఆయిల్‌)
  • చియా విత్తనాలు, అవిసె గింజలు, ఆక్రోటు కాయలు వంటి గింజలు, ఫ్లాక్స్‌ సీడ్‌ ఆయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌
  • తృణధాన్యాలు, రసాలను, పాలు, సోయా పానీయాలు వంటి ఫోర్టిఫైడ్‌ ఆహారాలు
  • విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉన్న ఆహారాలు
  • మామిడి, ఆప్రికాట్లు వంటి పండ్లు

డాక్టర్‌ కూరపాటి శ్రీనివాస్‌

- డాక్టర్‌ కూరపాటి శ్రీనివాస్‌
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఎండి, డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల, విజయవాడ.
చరవాణి : 9573724321