ప్రజాశక్తి-గుంటూరు : ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ రాష్ట్ర మహాసభ ఈ నెల 12, 13 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు గీతా రీజెన్స్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహాసభ పోస్టర్‌ను కెఎస్.లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పాల్గొని రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరారు. నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై దేశంలో పనిచేస్తున్న అతిపెద్ద సంఘంగా ఐలు గుర్తింపు పొందిందని, రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాద పరిరక్షణకు పనిచేస్తున్న సంఘంగా గుర్తింపు ఉందన్నారు. ఈ మహాసభను మొదటి రోజు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రారంభిస్తారని, రెండో రోజు సెమినార్‌లో ప్రముఖ న్యాయవాది, ఇండియన్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తున్న తీస్తా సెతల్వాద్ పాల్గొంటారని తెలిపారు.