- నిరాహారదీక్ష ప్రారంభంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి-విజయవాడ : 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్ధులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హెచ్చరించారు. 1998 డిఎస్‌సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఆ పోరాట కమిటీ ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయం జరిగిన అభ్యర్థులందరికీ అవకాశాలు కల్పిస్తామని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 25 సంవత్సరాల నిరీక్షణ అనంతరం అందరికీ ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు ఆశపడ్డారని తెలిపారు. 2022 సంవత్సరం జూలైలో 6754 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేసి, 4072 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకపోవడం వల్ల 2326 మంది ఎస్‌సి, బిసి, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి తన సొంత జిల్లాతో పాటు నాలుగు జిల్లాల అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారన్నారు. కర్నూలు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు కృష్ణా జిల్లాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ.. మిగిలిన అభ్యర్థులందరికీ వెంటనే ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ అధ్యక్షులు జి మోహనరావు మాట్లాడుతా.. అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని, మా సహనానికి పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇవ్వాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పి రమేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.