- గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలి : ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల జిల్లా) : నీటి వనరులతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పర్చూరులోని కొల్లా వారి కల్యాణ మండపంలో మంగళవారం రైతు సదస్సు జరిగింది. దీనికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మాట్లాడారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ ఛానల్ విస్తరణకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. భూసేకరణ ప్రకటన జారీ చేసి రూ.113 కోట్లు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. కామ్రేడ్ కొల్లా వెంకయ్య లాంటి ఎందరో నాయకులు గుంటూరు ఛానల్ కార్యరూపం దాల్చాలనే ఉద్దేశంతో పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సభకు ఎఎంసి మాజీ చైర్మన్ నరిశెట్టి ఆచార్యులు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు, ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య పాల్గొన్నారు.