వడ్డాది పెద్దేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు నియంత్రించాలి : అధికారులకు ఫిర్యాదు

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట (అనకాపల్లి) : వడ్డాది ఎస్సీ కాలనీ సమీపంలోని పెద్దేరు నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో రెవెన్యూ పంచాయతీ, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. మాజీ వార్డు మెంబర్ కే.గురుమూర్తి మాట్లాడుతూ ... మంచినీటి ట్యాంకు సమీపంలో అడ్డూ అదుపు లేకుండా టైరుబళ్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని, తవ్వకాలు కొనసాగితే తుఫాను సమయంలో వాటర్ ట్యాంక్ కొట్టుకుపోతుందన్నారు. కాలనీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అనుమతులు లేకుండా పగలు, రాత్రి విచ్చలవిడిగా నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. ఇసుక తవ్వకాల వలన భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయన్నారు. వ్యవసాయ పొలాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలను అరికట్టకపోతే ఆందోళన చేస్తామని ఎస్సీ కాలనీ ప్రజలను హెచ్చరించారు.