Jan 22,2023 11:42
  • 'మన్యం' ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల మెడపై 'హౌసింగ్‌' కత్తి

ప్రజాశక్తి - సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : పట్టణంలో పేదల గృహ నిర్మాణానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోతే వేటు తప్పదని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పట్టణ, మండల గృహ నిర్మాణంపై ఆయన మున్సిపల్‌, హౌసింగ్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. తొలుత పట్టణానికి చెందిన సచివాలయాల వారీగా సమీక్షించారు. ఒక్కో సచివాలయం పరిధిలో గృహ నిర్మాణం ప్రగతికి సంబంధించి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో మాట్లాడారు. పునాది, శ్లాబ్‌ స్థాయి, శ్లాబ్‌ పూర్తి చేసిన ఇళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణానికి చెందిన జగనన్న లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు అన్ని సచివాలయాల పరిధిలో ఇళ్ల నిర్మాణం మందకొడిగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పనితీరు కనబరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూగుల్‌ లాంటి కంపెనీ 12వేల మంది ఉద్యోగులను తొలగించిందని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. జిల్లా అంతటా గృహ నిర్మాణ ప్రగతి బాగుందని, సాలూరులో వెనుకబాటుతనం జిల్లా ప్రగతిపై ప్రభావం చూపిస్తోందని చెప్పారు. జిల్లాలో గృహ నిర్మాణ పనులు 65శాతం ఉంటే సాలూరు అర్బన్‌లో కేవలం ఐదు శాతం ఉందన్నారు. గృహ నిర్మాణంలో పురోగతి కనిపించకపోతే జీతాలు నిలిపివేస్తామన్నారు. ప్రణాళికాబద్దంగా ఇళ్ల నిర్మాణంపై లబ్దిదారులకు అవగాహన కల్పించి, నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. తదుపరి సమీక్ష సమావేశం నాటికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకపోతే క్షమించేది లేదన్నారు. గుమడాం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం చేపట్టబోమని పట్టాలు ఇచ్చేసిన వారి స్థానంలో కొత్త వారికి కేటాయింపు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారులు కొంతమంది యూనిట్‌ విలువ తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఒక ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ దృష్టికి తీసుకెళ్ళగా యూనిట్‌ విలువ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. లబ్దిదారులకు బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలు ఇప్పించడంలో పురోగతి లేదని మెప్మా సిఎంఎం, సిఆర్పీలపై ఆగ్రహించారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి పనితీరులో మార్పు కనిపించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పేదల ఇళ్ల నిర్మాణ ప్రగతి బాధ్యత ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లదే అన్నట్లు వారిని లక్ష్యంగా చేసుకుని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించిన తీరు చర్చనీయాంశమైంది. ఏమైనా చిరుద్యోగులైన సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల మెడపై హౌసింగ్‌ కత్తిని వేలాడదీసినట్లు జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ కనిపించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ హెచ్‌ శంకరరావు, హౌసింగ్‌ డిఇ సోమేశ్వర రావు, ఎంపిడిఒ జి.పార్వతి పాల్గొన్నారు.