Aug 01,2023 11:09

విశాఖ : ' ముఖ్యమంత్రి వస్తే సిపిఎం నాయకుల గృహనిర్భంధం ఎందుకు ? ' అని సిపిఎం మద్దిపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణా రావు ప్రశ్నించారు. మంగళవారం సిఎం జగన్‌ విశాఖలో పర్యటిస్తున్న సందర్భంగా ... పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. నగరంలోని పలువురు వామపక్ష నేతలను గృహనిర్బంధం చేశారు.

సిపిఎం మద్దిపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణా రావు మాట్లాడుతూ ... రహేజాకు ఇచ్చిన పోర్ట్‌ స్థలం శంకుస్థాపన ఆపాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటితో ఈ రోజు ముఖ్యమంత్రి చర్చించాలని కోరారు. అదాని గంగవరం పోర్ట్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థుల వసతిగృహాలకు ప్రభుత్వం స్థలం కేటాయించి సొంతభవనాలు నిర్మించాలని అడిగారు. యూనివర్సిటీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ డిమాండ్ల పై ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించాలని వామపక్ష పార్టీలు గత వారం రోజులుగా డిమాండ్‌ చేస్తున్నాయని తెలిపారు. వీటిపై మాట్లాడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రహేజా సంస్థ చేపట్టే మాల్‌ ప్రారంభానికి రావడం సిగ్గుచేటు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు, పరిశ్రమలు బిజెపి ప్రభుత్వం అమ్మేస్తుంటే దానిని కాపాడాల్సిన ముఖ్యమంత్రి దగ్గరుండి ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయడం రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టుపెట్టడమేనన్నారు. సమస్యలను పరిష్కరించకపోగా... ముఖ్యమంత్రిని అడ్డుకుంటారన్న నెపంతో సిపిఎం జిల్లా నాయకులు ఆర్‌ కె ఎస్‌ వి కుమార్‌, మణి, ఎస్‌.ఎఫ్‌.ఐ నాయకుడు గౌతమ్‌ లను గఅహనిర్భంధం చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే నిర్భంధ చర్యలు మానుకొని విశాఖ ప్రజలకు పై వాటిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నదన్నారు. లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.