Aug 13,2023 13:37

'వైకల్యంతో ఉన్న నాకు మా అమ్మానాన్న అండగా ఉన్నారు. అమ్మ ప్రోత్సాహంతోనే అంధుడినైనప్పటికీ చదువుకోగలిగాను' అంటున్న కర్నాటకకు చెందిన దత్తు అగర్వాల్‌ ఉన్నత విద్య చదివారు. పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకుడిగా 30 ఏళ్ల పాటు పనిచేశారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే... రాష్ట్రవ్యాప్తంగా అంధ బాలికల కోసం ప్రత్యేక పాఠశాల లేకపోవడం గమనించి, తానే ఒక పాఠశాల ప్రారంభించారు. తన వేతనం మొత్తాన్ని పాఠశాల నిర్వహణకు ఉపయోగించటం మొదలెట్టారు. 'మాతోశ్రీ' పేరుతో నిర్వహిస్తున్న ఆ పాఠశాలలో ఇప్పుడు 75 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు.

         'సరైన ప్రోత్సాహం లేకపోతే నాలాంటి వాళ్లు పడే బాధలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. నాకా పరిస్థితి లేదు. కానీ, వైకల్యంతో బాధపడుతున్న నేను కాకపోతే ఇంకెవ్వరు వారి కోసం తాపత్రయపడతారనిపించింది' అంటున్నారు దత్తు. ఆయన కల్బుర్గిలో పుట్టి పెరిగారు. బాల్యంలో ఆస్త్మాతో బాధపడిన ఆయన మూడేళ్ల వయసు వచ్చేసరికి కంటిచూపు కోల్పోయారు. 'ప్రపంచాన్ని గమనించేలోపే నా చూపు పోయింది. అమ్మానాన్న బాగా ఏడ్చారు. అయితే నన్ను స్వతంత్రుడిగా ఎదిగేలా ఎంతో ప్రోత్సహించారు. 8 ఏళ్లకు నన్ను స్కూలులో చేర్పించారు' అని తన బాల్యం గురించి చెప్పారాయన. దత్తు, గుల్బర్గా యూనివర్శిటీలో పొలిటికల్‌ సైన్స్‌ చదివి, 1985 నుంచి అదే యూనివర్శిటీలో పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకుడిగా పాఠాలు బోధిస్తున్నారు.
            ఇల్లు, స్కూలు, కాలేజీ.. ఎక్కడా తానొక అంధుడినన్న సంగతి ఇబ్బందిపెట్టకుండా పెరిగారు దత్తు. కానీ అంధులైన ఇతరులు పడే ఇబ్బందులు గమనించేవారు. 'నువ్విక ఏం చేయగలవు? నీకు నువ్వే భారం..' వంటి సాధారణ వెక్కిరింపుల మొదలు, మనసును మెలిపెట్టే అవమానాలెన్నింటినో వైకల్య బాధితులు ఎదుర్కొంటారు. అటువంటి వారికి నేనొక కొత్త ప్రపంచాన్ని ఇవ్వాలనుకున్నాను. ఆ ప్రపంచంలో పక్షపాతానికి స్థానం ఉండకూడదు. నా కదలికలను నేను గమనించలేకపోవచ్చు.. కానీ ఆ కదలికలే నా ఉన్నతికి, విజయానికి మార్గం వేస్తాయి అని బలంగా నమ్ముతాను. నా కమ్యూనిటీ వారు పడే బాధలు గమనిస్తున్న నాకు, ఆడపిల్లలు ఈ వైకల్యంతో ఎంత వేదన అనుభవిస్తున్నారో అన్న ఆలోచన రాగానే నిద్ర పట్టలేదు' అంటూ తన ప్రయాణం గురించి వివరించారు.

88


         ఆ ఆలోచనతోనే ఆయన అంధ బాలికల కోసం 'మాతోశ్రీ అంబుదాల్‌ రెసిడెన్షియల్‌ స్కూలు' ప్రారంభించారు. అంతకు ముందే.. 1990ల్లో 'హైద్రాబాద్‌ కర్నాటక వైకల్య సొసైటీ'ని స్థాపించి ఎంతోమందికి సేవలందించారు. ఆ సంస్థ కింద స్థాపించిన 'మాతోశ్రీ' స్కూల్లో చదివే పిల్లలందరూ వైకల్య బాధితులు మాత్రమే కాదు; ఆర్థికంగా కుదేలైన కుటుంబాల వారు.
        'మా అమ్మ నాకు గొప్ప స్ఫూర్తి.. సమాజంలో నేను ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలో.. ఎలా ఉండాలో.. ప్రతి ఒక్కటీ నేర్పించింది. గొప్ప పట్టుదల ఉన్న మహిళగా ఆమె ఎప్పటికీ నాకు చెరగని జ్ఞాపకమే. అందుకే అమ్మ పేరుతోనే ఈ పాఠశాల స్థాపించాను' అంటూ తన తల్లి గొప్పతనాన్ని చెబుతారు దత్తు.
          '2000 సంవత్సరం వరకు మా జిల్లాలో అంధ బాలికల కోసం ప్రత్యేక స్కూలు లేదు. నేను ప్రారంభించినప్పుడు కేవలం నలుగురే జాయినయ్యారు. గ్రామాలు తిరిగి అంధ బాలికలకు విద్య, వసతి కల్పిస్తామని చెప్పినా, ఎవరూ నమ్మలేదు. బాలికల రక్షణ పట్ల ఆ తల్లిదండ్రుల్లో విపరీతమైన భయాన్ని గమనించాను. పైగా విద్య వారి బతుకులను బాగు చేస్తుందని, అమ్మాయిలు చదువుకుంటే తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకుంటారన్న అవగాహన లేని కుటుంబాలు వారివి' అంటూ స్కూలు ప్రారంభంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
       మొదట పిల్లల కోసం ఊళ్లు పట్టుకు తిరిగిన దత్తు స్కూల్లో, ప్రస్తుతం 75 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. కల్బుర్గి, బిడార్‌, యాదగిర్‌, రారుచూర్‌, కొప్పల్‌, బళ్ళారి జిల్లాల నుండి ఆ పిల్లలు వస్తున్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ 'స్థానికంగా స్కూళ్లు లేకపోవడం వల్లే పిల్లలు ఇంత దూరం వచ్చి చదువుకుంటున్నారు. భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితి మారాలి. మరిన్ని పాఠశాలలు రావాలి' అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు ఆటలు, సంగీతం వంటి ఇతర అంశాలపై కూడా మాతోశ్రీలో బోధిస్తున్నారు.
          అయితే, దత్తు ఇప్పుడు ఉద్యోగం నుంచి రిటైరయ్యారు. ఆయనకు జీతం ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. ఆ ప్రభావం ఈ స్కూలు నిర్వహణ మీద పడింది. దాంతో, ఈ స్కూల్లో ప్రస్తుతం కొత్త అడ్మిషన్లు తీసుకోవడం లేదు. 'రిటైర్‌ అవ్వడంతో నిధుల కొరతతో ఇబ్బందిగా ఉంది. ఇది చాలా బాధాకరమైన సమస్య.'' అని దత్తు చెబతున్నప్పుడు ఆయన మాటల్లో తీవ్ర ఆవేదన విన్పించింది. దత్తు చేస్తున్న కృషికి దాతల సాయం అందాలని ఆశిద్దాం.

778

                                                                            లాయర్‌ని అవుతా ...

నేను హైద్రాబాద్‌లో ఐ' క్యాంపుకు వెళ్లినప్పుడు దత్తు సార్‌ గురించి తెలిసింది. వెంటనే అమ్మానాన్న నన్ను ఇక్కడ చేర్పించారు. 7వ తరగతిలో నాకు సీటు వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఇంటిని బాగా మిస్‌ అవుతున్నాను. అయినా నాకు ఇక్కడికి వచ్చాకే.. ఎంతో ధైర్యంగా, ఏదైనా సాధించాలన్న ఆశ కలిగింది. బాగా చదువుకుని లయర్‌ని అవుతాను. అమ్మానాన్నకు సాయంగా నిలుస్తాను.
                                                                                                                         - ఇద్మా, విద్యార్థిని

                                                                           ఏ స్కూల్లోనూ చేర్చుకోలేదు

'నేను మదన్‌పురా నుంచి నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రాకముందు ఏ స్కూల్లోనూ నన్ను చేర్పించుకోలేదు. డబ్బు పెట్టి ప్రైవేటు స్కూల్లో చేర్పించే స్థోమత మా తల్లిదండ్రులకు లేదు. ఇక్కడి టీచర్లు, సిబ్బంది మాకు బాగా సహకరిస్తారు.
                                                                                                           - ముస్కాన్‌, ఐదో తరగతి