
- రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపి పల్లకి మోయడం మానుకోవాలి : వి శ్రీనివాసరావు
- రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా
- విశాఖ జిల్లాలో 35 మంది రైతులు, సిపిఎం నాయకులు అరెస్టు, విడుదల
- ముగిసిన సమరభేరి
ప్రజాశక్తి- యంత్రాంగం : మోడీ మళ్లీ అధికారంలోకొస్తే దేశం చీకటి రాజ్యంగా మారనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మోడీని గద్దె దించడానికి ఇండియా పేరుతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన పార్టీ... బిజెపి పల్లకి మోయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన గత నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమరభేరి సోమవారం ముగిసింది. చివరి రోజు ఆయా తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, కార్పొరేషన్ కార్యాలయాలు నిరసన తెలిపారు. ధరలు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ, అనకాపల్లితోపాటు పలు జిల్లాల్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం తహశీల్దార్ కార్యాలయం తలుపులు మూసేసి తహశీల్దార్‌ను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా సిపిఎం ఆధ్వర్యాన రైతులు అడ్డుకున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు తీసుకున్న భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని, లేకుంటే తీసుకున్న భూములకు బదులుగా పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 35 మంది రైతులను, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో వి.శ్రీనివాసరావు దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు కలిగిన మన దేశంలో ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జమిలి ఎన్నికల పేరుతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఒకేసారి ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత అనివార్య పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి అనంతరం ఎన్నికలు జరపాల్సి వస్తే దేశమంతా మళ్లీ ఎన్నికలు జరుపుతారా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాన మోడీ... లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. నల్లడబ్బు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం మాట తప్పను మడమ తిప్పను అనే దానికి తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. విద్యుత్ ఉద్యమం ఫలితంగా పది సంవత్సరాలపాటు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వమూ సాహసించలేదని తెలిపారు. కేంద్రంలోని మోడీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను మన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహంగా అమలు చేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భారాలు మోపిందన్నారు. విద్యుత్ ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. తమ సమస్యలపై అర్జీలతో ప్రజలు ధర్నాకు తరలివచ్చారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.భాస్కరయ్య, జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేయకపోవడం శోచనీయమన్నారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పట్ల ఆయనకు శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలోని గాంధీనగర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను ప్రజలపై భారాలు మోపిందని, అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లకు రాయితీల రూపంలో దేశ సంపదను కట్టబెట్టిందని విమర్శించారు. బాపట్ల జిల్లా కొల్లూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.200 చేరుకుందని, దీంతో, కొనుగోలు చేయలేని స్థితిలో పేదలు ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చౌకదుకాణాల ద్వారా గత రెండు నెలల నుంచి కందిపప్పు అందించకపోవడం శోచనీయమన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహశీల్దార్ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ లోపం కారణంగా హద్రీనీవా కాలువ ద్వారా నీరు సక్రమంగా అందడం లేదన్నారు. 12 రోజుల్లో మూడుసార్లు ఈ కాలువకు గండ్లు పడడాన్నిబట్టి కాలువల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ మాట్లాడుతూ ధరలు పెంచడంలో పోటీపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాయని విమర్శించారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మూలం రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని విమర్శించారు. అనకాపల్లి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని పివిటిజిలకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, స్పెషల్ డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో జరిగిన ధర్నాలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము పాల్గొని మద్దతు తెలిపారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ధర్నాలు జరిగాయి.

