
ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్) : పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి ఆంజనేయులు డిమాండ్ చేశారు. విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ప్రపంచ బ్యాంకు సంస్కరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని విద్యుత్ చార్జీలు తగ్గించకపోగా 100% చార్జీలు పెంచారన్నారు. విద్యుత్ రంగంలో నష్టాల కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆర్ రమేష్ బాబు, మండల కమిటీ సభ్యులు సిహెచ్ సుధాకర్, వి వెంకటరెడ్డి, ఎస్ ఇసాక్, పి నాగేశ్వరరావు, టి శేషయ్య, లంక వెంకటేశ్వరరావు, ఎస్ పౌలు, సురేష్, సిహెచ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.