- సిపియం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ పిలుపు
ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : గురువారం ఉదయం 10 గంటల నుంచి కొండపల్లి వెలగా లక్ష్మణరావు భవన్ సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు పూర్తిగా వైపల్యం చెందాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యాసర వస్తువులు ధరలు ఆకాశానికి అంటుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు నియంత్రించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, విమాన, ఎల్ఐసి, తదితర సంస్థలు కార్పొరేట్ చేయడంలో బిజెపి ప్రముఖ పాత్ర పోస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సైతం ప్రైవేటీకరణ చేయడంలో బిజెపి ముందంజలో దూసుకుపోతుందని అయినప్పటికీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. దేశంలో 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా రద్దు చేసిందని, ప్రజల వద్ద నుండి ముక్కుపిండి మరి పన్నులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలను సైతం పక్కదారి పట్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలకు 2024 నుంచే 33 % రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు పెరిగిన విద్యుత్ ఛార్జీలు గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో 42 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్ లు తీసుకువచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థలకు అనుగుణంగా కార్మికుల చేత వెట్టిచాకిరి చేపిస్తున్నారని, కాంట్రాక్టు వర్కర్స్ కనీస వేతనం 26 వేలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పర్మినెంట్ చేయకుండా కాలయాపన చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. నవంబర్ 15వ తేదీన జరిగే సిపిఎం బహిరంగ సభకు ఇబ్రహీంపట్నం మండలం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్, కమిటీ సభ్యులు ఎ విఠల్ రావు, సిహెచ్ శివ, వి మురళీ మోహన్, ఇ.కొండలరావు బి వెంకటేశ్వరరావు, ఎల్ పార్వతీ, సభ్యులు కె నారాయణ , ఎన్ బాబ్జీ, కె కోటేశ్వరరావు, కామేశ్వరరావు , చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు