Aug 14,2023 21:05
  • ఎస్‌ఇ కార్యాలయం వద్ద ధర్నాలో వి రాంభూపాల్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : తుంగభద్ర హెచ్‌ఎల్‌సి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టకుండా, సాగు నీటిని పరిరక్షించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి రాంభూపాల్‌ విమర్శించారు. హెచ్‌ఎల్‌సి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టి, రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ జిల్లాకు ఏకైక సాగునీటి వనరు తుంగభద్ర డ్యాం అని, ఈ డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సి కాలువ ద్వారా నీరు అందుతోందని తెలిపారు. దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ కాలువ పూర్తిగా బలహీనపడిందన్నారు. కాలువ ఆధునీకరణ పనులు చేపట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని తెలిపారు. దీనివల్ల జిల్లాకు రావాల్సిన నీటిని పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల పదిన బొమ్మనహాల్‌ మండలం 113 కిలోమీటర్‌ దగ్గర హెచ్‌ఎల్‌సి ప్రధాన కాలువ నుంచి పెద్ద ఎత్తున లీకేజీ అయ్యిందన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కాలువ మరమ్మతు, నిర్వహణకు అవసరమైన నిధులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం హెచ్‌ఎల్‌సి ఎస్‌ఇని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఒ నల్లప్ప, ఎం బాలరంగయ్య పాల్గొన్నారు.