Sep 08,2023 15:54

పల్లెకెలె : ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో టీమిండియా-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ను కేటాయించారు. ఇరు జట్లు కూడా సూపర్‌-4కు చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సూపర్‌-4 మ్యాచ్‌ ఈ నెల 10న జరగనుంది. ఈ మ్యాచ్‌ అయినా జరుగుతుందా? లేదా? అనే ఆందోళన అభిమానుల్లో ఉంది. అయితే అభిమానులకు ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డేను ప్రకటించింది. 10వ తేదీన మ్యాచ్‌ ఆగిపోతే... 11న ఆటను కొనసాగిస్తారు. అంటే మ్యాచ్‌ ఎక్కడ ఆగిందో... మరుసటి రోజున అక్కడి నుంచి కొనసాగిస్తారన్న మాట. ఇంకోవైపు, సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్స్‌ మ్యాచ్‌కు గతంలోనే రిజర్వ్‌ డేను ప్రకటించారు.