Aug 25,2023 22:31

ముంబయి: ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ క్రికెట్‌లో అడుగుపెట్టనుంది. ఈ బ్యాంక్‌ తాజాగా భారత్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌ల టైటిల్‌ స్పాన్సర్‌ హక్కులను దక్కించుకుంది. మూడేళ్ల కాలానికి ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ బిసిసిఐకి రూ.235 కోట్లు చెల్లించనుంది. ఈమేరకు ఐడిఎఫ్‌సి, బిసిసిఐ మధ్య ఒప్పందం కుదిరింది. రూ.2.4 కోట్ల కనీస ధరతో వేలం ప్రక్రియ మొదలైంది. సోనీ స్పోర్ట్స్‌ నుంచి ఐడిఎఫ్‌సి బ్యాంక్‌కు గట్టి పోటీ ఎదురైంది. అయితే.. చివరకు రూ.4.2 కోట్లతో సొంతం చేసుకుంది. ఇక నుంచి ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఐడిఎఫ్‌సి రూ.4.2 కోట్లు చెల్లించనుంది. గతంలో కంటే రూ.40 లక్షలు ఎక్కువ. ఇంతకుముందు మాస్టర్‌ కార్డ్‌ సంస్థ ప్రతి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌కు రూ.3.8 కోట్లు బిసిసిఐకి ముట్టజెప్పేది. ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ మూడేళ్ల పాటు బిసిసిఐ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2026 ఆగస్టులో ఈ కాంట్రాక్టు ముగియనుంది. ఈ సమయంలో భారత జట్టు స్వదేశంలో 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. దాంతో మొత్తంగా 235 కోట్ల రూపాయలు బిసిసిఐకి సమకూరనున్నాయి. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌తో బిసిసిఐ మీడియా ప్రచారకర్తగా ఐడిఎఫ్‌సి సేవలందింనుంది.