- పంపిణీ చేస్తున్న ఆహారంలో నాణ్యత లేదు
- అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బ రావమ్మ
- పలాసలో 8 వ జిల్లా మహాసభలు
ప్రజాశక్తి-పలాస (శ్రీకాకుళం) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ బడ్జెట్ కేటాయింపులు రోజు రోజుకు తగ్గిస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రానికి రూ. 20,500 కోట్లు కేటాహించడం జరిగిందని, వాటిని రూ. 50 వేల కోట్లు పెంచాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బ రావమ్మ డిమాండ్ చేశారు. కాశీబుగ్గ ఎస్‌ఎంసి ఫంక్షన్ హాల్‌లో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ 8 వ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ లక్ష్యానికి విరుద్ధంగా ఉందని దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2022 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూట్ అమలు చేయాలని ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే అమలు చేయకపోతే పోరాటాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనాలు కన్నా అదనంగా ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విధుల్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మృతి చెందితే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు రూ. 5 లక్షలు చెల్లించాలని కోరారు. మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా మార్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపించిందని, నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కోసం మెనూ చార్జీలను పెంచాలని కోరారు అంగన్వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు అమ్మవడి పథకం అమలు చేయడంతో పాటు ఉచితంగా బూట్లు, పుస్తకాలు, బెల్ట్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల పై రాజకీయ ఒత్తిళ్లు ఆపాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమా మహేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు డి.సుదర్శనం, జిల్లా కోశాధికారి కె.కళ్యాణి, కాశీబుగ్గ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు డి.ఆదిలక్ష్మి, ఎం.మంజులా కుమారి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వర రావు, కోశాధికారి అల్లు.సత్యనారాయణ, సిఐటియు జిల్లా కార్యదర్శిలు ఎన్.గణపతి, ఎస్.లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.