May 02,2023 20:56
  • ఐదేళ్లలో 7,800 మందిపై వేటు
  • ఆ కంపెనీ సిఇఒ వెల్లడి

న్యూయార్క్‌ : కృత్రిమ మేధతో అనేక రంగాల్లోని ఉద్యోగులకు పెను ప్రమాదం పొంచి ఉంది. వచ్చే ఐదేళ్లలో తమ సంస్థ దాదాపు 7,800 మంది ఉద్యోగులను తొలగించనుందని టెక్‌ దిగ్గజం ఐబిఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) అరవింద్‌ కృష్ణ వెల్లడించారు. ఆ చోట కృత్రిమ మేధను ఉపయోగించుకోనున్నామన్నారు. మానవ వనరులను ఎఐ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. ఎఐతో దాదాపు 30 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నామని ఐబిఎం చీఫ్‌ పేర్కొన్నారు. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఆయా కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే ఐబిఎం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. కొన్ని వ్యాపార విభాగాలకు పూర్తిగా స్వస్తి చెప్పింది. తాజా తొలగింపుల ప్రకటన మంగళవారం పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
వచ్చే ఐదేళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఉద్యోగాలు ఊడ్చుకుపోనున్నాయని వాల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యుఇఎఫ్‌) సోమవారం ఓ రిపోర్టులో హెచ్చరించిన విషయం తెలిసిందే. దీన్ని వాస్తవం చేసేలా ఐబిఎం ప్రకటన చేయడంతో ఐటి ఉద్యోగుల్లో ఆందోళన రేకిత్తించింది. ఇప్పటికే అమెజాన్‌ కూడా తన మానవ వనరుల విభాగంలో ఉద్యోగులను తొలగించి వారి స్ధానంలో ఎఐని వినియోగించడానికి సన్నద్దమవుతోంది. ఎఐ అమలులో నియంత్రణ చర్యలు ఉండాలని టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌, గూగుల్‌ సిఇఒ సుందర్‌ పిచారు, మైక్రోసాఫ్ట్‌ బాస్‌ సత్యా నాదేళ్ల తదితరులు పేర్కొంటున్నప్పటికీ.. పోటాపోటీగా ఆయా టెక్‌ కంపెనీలు కృత్రిమ మేధపై విస్తృత ప్రయోగాలు చేస్తున్నాయి. మరోవైపు విధుల్లోకి కొత్త ఉద్యోగులను తీసుకోవడాన్ని ఐబిఎం నిలిపివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఆ కంపెనీ ఉన్నతాధికారులకు అర్వింద్‌ కృష్ణ ఇప్పటికే సూచనలు చేశారని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. మరోవైపు ఆర్థిక సేవల సంస్థ మోర్గన్‌ స్టాన్లీ మరోసారి దాదాపు ఐదు శాతానికి సమానమైన తమ 3,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే అవకాశాలు ఉన్నాయని రిపోర్టులు వస్తున్నాయి. జూన్‌ ముగింపు నాటికే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలుపడనుందని సమాచారం.

  • ఎఐతో మహా ప్రమాదం : గూగుల్‌ మాజీ ఉన్నతాధికారి

కృత్రిమ మేధ వల్ల మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందని గూగుల్‌ మాజీ ఉన్నతాధికారి జెఫ్రీ హింటన్‌ హెచ్చరించారు. ఇంతక్రితం ఆయన గూగుల్‌ ఎఐ విభాగం బాధ్యతలను చూశారు. గత వారమే రాజీనామా చేసినట్లు ఆయన ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. ఎఐ మానవాళిని ప్రమాదంలోకి నెట్టనుందన్నారు. ఎఐ ఇప్పటికిప్పుడు మనుషుల కటే తెలివైనవి కాకపోయినప్పటికీ.. భవిష్యత్తులో చాలా శక్తివంతం అయ్యే అవకాశం ఉందన్నారు.