Jul 11,2023 09:00
  • హైకోర్టు తీర్పు
  • అప్పీలుకు అవకాశం

ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కార కేసులో విశాఖ జిల్లా పూర్వపు కలెక్టర్‌, ఎపిఐఐసి ప్రస్తుత వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు (విసిఎమ్‌డి) ప్రవీణ్‌కుమార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని తప్పుపట్టింది. 2 వారాల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అప్పీల్‌ దాఖలు చేసుకునే నిమిత్తం తీర్పు అమలును 4 వారాలు నిలుపుదల చేస్తూ జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావు సోమవారం తీర్పు చెప్పారు. భీమునిపట్నం మండలం కాపులుప్పాడ గ్రామంలో తమకు చెందిన ఏడెకరాల భూమిని నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చడాన్ని సవాలు చేస్తూ ఎల్‌ శ్రీనివాసరావు సహా ఐదుగురు 2017లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అదే ఏడాది ఏప్రిల్‌ 27న తీర్పును అమలు చేయలేదని దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌లో తాజాగా తీర్పు వెలువరించింది. తీర్పు సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ సోమవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు.