నీక్కావాల్సింది
నా పతనమే అనుకుంటా
నేను అనంత విశ్వమైన ధైర్యాన్ని
నీక్కావాల్సింది
నా బానిసత్వం అనుకుంటా
నేను కుల, మతతత్వంపై
తిరగబడే అక్షరాన్ని
నేను సామాన్యుల గొంతుకను
కార్పొరేట్ కలల ప్రపంచానికి
ఉక్కు పిడికిలిని !
తుపాను రావొచ్చు, పోవొచ్చు
ఫోన్లో బెదిరింపులు హూంకరించవొచ్చు
ఇళ్ళపై దాడులు చేయొచ్చు
ఈ ప్రళయ విలయ బెదిరింపుల్లో
బాధితుల పక్షం నా గొంతు
నేను అక్షరాన్ని
వెనుదిరిగి అడుగు వేయను
నిజాన్ని నిర్భయంగా రాస్తాను
నేను సత్యాన్ని
సత్యం పలకడానికి
విషాన్ని సైతం సోక్రటిస్‌లా తాగుతాను!
బ్రూనో, కోపర్నికస్‌ల వారసురాలిని
కపట కౌటిల్యాల, మతతత్వ పోకడలను
ఒక్క కుదుపు కుదుపుతాను !
నేను
ఉరికొయ్యను ముద్దాడిన
భగత్ సింగ్, కెన్ సారోవివాల స్ఫూర్తిని!
నేను ప్రశ్నను
తిరిగి లేచే ఫినిక్స్ పక్షిని
నేను ధిక్కార నంగేలిని
సొజర్నర్ ట్రూత్‌ని, మాయో ఎంజిలోని, గౌరి లంకేష్‌ని
నేను ప్రజాస్వామాన్ని
బాబా సాహెబ్ అంబేద్కర్
రాజ్యాంగ హక్కలతో పోరాడుతున్న
సామాన్య పోరాటాన్ని
నేను పీడితుల చైతన్య స్వరాన్ని
నేను తులసిచందును!
- తంగిరాల. సోని
9676609234










