వాళ్లెక్కడికి పోయుంటారు ?
వాళ్లనొక్కసారి మళ్లీ చూడాలనుంది
ఆ వీధిలో కడుగుపెడితే చాలు
పడుగు పేకల ఆకలి సంగీతం
నా గుండె తలుపు తట్టేది
ఎన్ని పోగులతికించినా
తమ ఆకలి పోగులతకకపోవటం
నా గుండెను మెలిపెట్టేది
వెన్నెల దారాల్ని సాపు చేసి
మన చిరుగుల సిగ్గుల్ని కప్పేసే
చందమాల్ని తయారు చేసేవాళ్లు
నా చిరుగుల బాల్యానికి ప్రేమగా కుట్లేసి
నన్ను సగర్వంగా వీధుల్లో తిప్పేవాళ్లు
ఆకలి పేగుల అరుపుల మధ్య
నగ్న దేహాలకు మెరుపులు తొడిగి
ఊరు ఊరంతా అందంగా ముస్తాబు చేసేవాళ్లు
అగ్గిపెట్టెలో అద్భుతమై ఒదిగిన వాళ్లు
తమ కుక్షికి ఒక్క మెతుకైనా ఎరగనివాళ్లు
వాళ్లింకా ఆ వీధిలోనే వుండి వుంటారా?
ఎన్ని పోగులతికించినా
తమ ఆకలి పోగుల్ని అతికించలేని
బతుకు మగ్గాన్ని వదిలేసి
వలస పక్షుల్లా ఎగిరిపోయుంటారా?
ఎక్కడ నూకల కోసం
పావురాల్లా పరితపిస్తున్నారో
ఎక్కడ విరిగిన మగ్గాలను తలపోస్తూ
నిత్య గాయాలవుతున్నారో
ఎక్కడ తెగిన బతుకు పోగుల్ని
కడుపులోని ఆకలి పేగులతో
కలల షటిల్లో దారంలా
ఆసుపోసుకుంటున్నారో !
లోకానికొక ఆకాశమంత
నీలి వస్త్రాన్ని తయారు చేసి
మెరిసే నక్షతాలు, రంగు రంగుల పూలు కుట్టి
బహుకరించిన వాళ్లు
తమ దేహానికి జానెడు గుడ్డెరుగని వాళ్లు
వాళ్లిప్పుడెక్కడుండి వుంటారు?
వాళ్లు ఖాళీ చేసిన వీధిప్పుడు
లేగదూడల్ని కోల్పోయిన
తల్లి ఆవులా భోరుమంటోంది!
వాళ్ల శిధిల గృహాలు కత్తిరించిన గుడ్డపేలికలై
శూన్యానికి వేలాడుతున్నాయి
వాళ్లనొక్కసారి తిరిగి
ఆ వీధిలో చూడాలనుంది
శిధిల గృహాలను పునర్నిర్మించి
వాళ్ల కలల యంత్రాలను మళ్లీ
ప్రతిష్టించాలని వుంది
ఆధునిక యంత్రాల ఇనుప పాదాల కింద
దారప్పోగుల్లా నలిగిపోయిన వాళ్లు
శిధిల వస్త్రాల్లా మిగిలిపోయినవాళ్లు
వాళ్లెక్కడ చిక్కిపోయుంటారు?
దారాలు పిగిలిన వస్త్రాలై
ఏ నిరాదరణ సుడిగాలికి చెదిరిపోయుంటారు?
వాళ్లనొక్కసారి మళ్లీ చూడాలనుంది !
- చిత్తలూరి
91338 32246










