Jul 24,2023 07:39

నేను నేరం చేశాను, వాడికి ఓటేసి ...
బుద్ధిజీవులు వద్దు వద్దంటున్నా వినలేదు
కమ్యూనిస్టులు అరిచి మొత్తుకుంటే
వాళ్లు అతిగా చెబుతున్నారని అపోహపడ్డాను
భారతమ్మ భవిష్యత్తు వాడి చేతిలో పెట్టాను
ఆడవాళ్లను దేవతలన్నాడని ఉప్పొంగిపోయాను
ఇలా నడివీధిన నగంగా ఊరేగిస్తాడనుకోలేదు !
56 అంగుళాల ఛాతీ అంటే దన్ను అనుకున్నాను
దాని వెనుక గుప్పెడంత హృదయం లేదని తెలుసుకోలేకపోయాను
సాధు గెడ్డం, సుదీర్ఘ మౌనం హుందాతనం అనుకున్నా
వాడి కనుసైగల్లోని క్రూరహాసం గుర్తించలేకపోయాను

అంతెత్తున వాడు ఎగరవేసిన జాతీయజెండాను
తన్మయత్వం తల ఎత్తి చూశాను తప్ప
వాడి వేటుకు రాలి కింద పడుతున్న
బడుగుల మాన ప్రాణాలను గమనించలేకపోయాను
సతీ సహగమనం ఎంతో గొప్ప ఆచారమని
వాడి పరివారం పరవశించినప్పుడు ఉలిక్కిపడ్డాను
ఆటల్లో ప్రపంచ కీర్తి తెచ్చిన
ఆడబిడ్డలతో ఆటలాడుతున్నప్పుడు
బచావో భేటీ అర్థం ఇదా అని కలవరపడ్డాను
మణిపూర్‌లోని ఆటవిక పర్వం చూశాక
వాడసలు మనిషే కాదని నిర్ణయానికొచ్చాను !
నిద్ర పట్టటం లేదు
కళ్లు మూస్తే ఊరేగింపు పీడకలలు
కళ్లు తెరిస్తే ధార కడుతున్న కన్నీళ్లు
ఊపిరాడ్డం లేదిప్పుడు
నాకే కాదు; దేశానికి కూడా ..!
మరొక్కసారి ఈ మూకను పీఠం ఎక్కిస్తే
దెయ్యాలే దేశాన్నేలతాయి
ఊరేగింపులు నిత్యకృత్యమవుతాయి ...
 

- ఎల్‌.శాంతి